పూలే విగ్రహం కోసం త్వరలో మహాధర్నా

పూలే విగ్రహం కోసం త్వరలో మహాధర్నా– రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ- సిటీబ్యూరో
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ప్రతిష్టించాలన్న డిమాండ్‌తో త్వరలో మహాధర్నా చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని చెప్పారు. ఏప్రిల్‌ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం భారత్‌ జాగృతిలో ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజాసంఘాలు, మేధావులు, రచయితలు, ప్రొఫెసర్లు హాజరై మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 9 తీర్మానాలను ఆమోదించారు. పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అలాగే బీసీ రిజర్వేషన్‌ బిల్లును తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, 8, 9, 10వ తరగతుల పాఠ్యపుస్తకాల్లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పొందుపర్చాలని తీర్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు ఇచ్చిన సూచనలు, సలహాలను స్వీకరించి తదుపరి కార్యాచరణలో చేర్చుతామని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు కోసం రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి లేఖలు రాయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలో, యూనివర్సిటీల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్‌ విగ్రహ ప్రతిష్టాపన కోసం పోరాటం చేసి సాధించామని గుర్తు చేశారు. బీసీల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఉద్యమించి సాధించామని, మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని అన్నారు. పదేండ్లలో గత బీసీల కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.50 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పటికీ నిఖార్సయిన ఎర్రజెండా స్ఫూర్తితో రౌండ్‌టేబుల్‌ సమావేశానికి హాజరైన సీపీఐకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్‌ల మాజీ చైర్మెన్‌లు వి.ప్రకాశ్‌, ఆంజనేయగౌడ్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు గట్టు రామచందర్‌రావు, సీపీఐ(ఎంఎల్‌) నాయకుడు సుభాష్‌, రచయిత సంఘిశెట్టి శ్రీనివాస్‌, పద్మశాలి సంఘం నాయకుడు శివశంకర్‌, ప్రొఫెసర్‌ తాటికొండ రాజయ్య, ఓయూ జేఏసీ నేత రాజారామ్‌ యాదవ్‌, సంచార జాతుల సంఘం ప్రొ. కోలా శ్రీనివాస్‌, సీపీఐ నేత బాలమల్లేశ్‌, సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్‌ జూలూరి గౌరీశంకర్‌, వడ్డెర సంఘం నాయకులు మురళీ, బీఎస్పీ నాయకులు అనితా రెడ్డి పాల్గొన్నారు.

Spread the love