గ్రూప్ – 1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: ఏం మహేందర్ రెడ్డి

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
గ్రూప్ -1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహణకు కావలసిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఎం మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్లుకు, పోలీసు సూపరింటెండెంట్లకు సూచించారు.  శనివారం నాడు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో వచ్చే జూన్ 9 వ తేదీన నిర్వహించబడే  టీఎస్ పి ఎస్ సి  గ్రూప్ -1 ప్రిలిమనరీ పరీక్షకు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రశాంత  వాతావరణంలో పారదర్శకంగా పరీక్ష నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రతి జిల్లాకు పరీక్షల నిర్వహణకు ఒక రీజనల్ కోఆర్డినేటను నియమించడం జరిగిందని, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు, రీజనల్ కోఆర్డినేటరు జాయింట్ కస్టోడియన్ గా ఉంటారని, వీరికి పోలీసు నోడల్ అధికారి సహకరిస్తారని, ప్రతి సెంటకు ఒక డిపార్టుమెంటల్ అధికారిని నియమించాలని, తహశీలుదారు స్థాయి అధికారిని ఫ్లయింగ్ స్క్వాడ్స్ గా, ప్రతి వంద మంది అభ్యర్ధులకు ఒక ఐడెంటిఫికేషన్ అధికారిని నియమించాలని, ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి చేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు ఎవరు కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు, గాడ్జెట్స్, సెల్ ఫోన్స్ వెంట తీసుకురాకుండా తనిఖీలు నిర్వహించాలని, పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేయాలని, పరీక్ష రోజున విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని, ఎమర్జెన్సీ మందుల ఏర్పాట్లతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాలలో నిబంధల మేరకు బందోబస్తు ఏర్పాట్లు ఉండాలని, పరీక్ష రోజు 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలని, అన్ని జీరాక్సు షాపులు బంద్ చేసి ఉండేలా చర్యలు తీసుకోవాలని, పరీక్ష రోజు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థుల కోసం అదనంగా, ప్రత్యేక ఆర్.టి.సి. బస్సులు నడపాలని, పరీక్షకు రెండు రోజుల ముందే కేంద్రాలలో పరిశుభ్రంగా పారిశుధ్య చర్యలు పూర్తి చేయాలని, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని తెలిపారు.
స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ ఏర్పాట్లు పఠిష్టంగా ఉండాలని, పరీక్ష మెటీరియల్ స్ట్రాంగ్ రూమ్ నుండి పరీక్షా కేంద్రాలకు, పరీక్ష అనంతరం స్ట్రాంగ్ రూముకు రవాణ ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని, వాహనాల కండీషన్ పూర్తి సామర్థ్యంతో ఉండేలా చూడాలని, ట్రాఫిక్ పైలట్ ఏర్పాటుతో రవాణా సాఫీగా అయ్యేలా పోలీసు శాఖ పర్యవేక్షించాలని సూచించారు. దివ్యాంగ అభ్యర్ధుల కోసం గ్రౌండ్ ఫ్లోర్ లోనే పరీక్షా కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేయాలని, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం అర్పులైన స్క్రైబ్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్ధులకు బయోమెట్రిక్ నిర్వహణ ఉంటుంది కాబట్టి సిబ్బందికి బయోమెట్రిక్ తీసుకునే విధానంపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. పరీక్షా కేంద్రాలలో రెండు రోజుల ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. రీజనల్ కోఆర్డినేటర్లకు, సెంటర్ అబ్జర్వర్లకు, డిపార్టుమెంట్ ఆఫీసర్లకు, పోలీస్ నోడల్ అధికారులకు ఈనెల 22 వ తేదీన హైదరాబాదులో కూకట్ పల్లి జేఎన్టీయూ  కాంప్లెక్స్ లోని యు.జి.సి. ఆడిటోరియంలో బయోమెట్రిక్ విధానంపై శిక్షణ అందిస్తామని తెలిపారు. జూన్ 9 వ తేదీన ఉదయం 10-30 గంటల నుండి మధ్యాహ్నం 1-00 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుందని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులను బయోమెట్రిక్ హజరు దృష్ట్యా ఉదయం 9-00 గంటల నుండే కేంద్రాలలోనికి అనుమతించడం జరుగుతుందని, 10=00 గంటలకు గేట్లు మూసివేయాలని, ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించడం కుదరదని ఈ సందర్భంగా తెలియచేస్తూ అభ్యర్ధులు తమ వెంట హాల్ టిక్కెట్ తో పాటు ఫోటో ఐడెంటిటీ కార్డు తీసుకురావాలని తెలిపారు.  వీడియో కాన్ఫరెన్స్ లో  జిల్లా కలెక్టరు హనుమంతు కే జెండగే, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె గంగాధర్, అధికారులు పాల్గొన్నారు.
Spread the love