Monday, July 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు మోక్షం.!

మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు మోక్షం.!

- Advertisement -

స్థానిక సమస్యల పరిష్కారంపై ఆశలు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల నిర్వహణకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఇక నుంచి ప్రతి 45 రోజులకోసారి విధిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మే రకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. తద నుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని మండలాల్లో ఈనెల 29న సర్వసభ్య సమావే శాలు నిర్వహించాలని నిర్ణయించింది. మండల అధ్యక్షులు లేకపోవడంతో ప్రత్యేకాధికారి అధ్యక్షతన కొనసాగనున్నాయి. రెండేళ్ల తర్వాత నిర్వహించనున్న సమావేశాలతో స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారంపై గ్రామీణులు గంపెడాశలు పెట్టుకున్నారు.

ఇదీ పరిస్థితి..
పాలకవర్గాలు ఉన్న సమయంలో ప్రతీ మూడు నెలల కోసారి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు జరిగేవి.ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి జెడ్పీటీసీతో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల, పలువురు డివిజన్ స్థాయి అధికారులు హాజరయ్యేవారు. గ్రామాల సమస్యలను సభ్యులు ఇందులో ప్రస్తావించేవారు. అధికారుల దృష్టికి రావడంతో పాటు పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు అవకాశముండేది. అయితే పరిషత్ పాలకవర్గాల గడువు 2024 జూన్ 24న ముగిసింది. ప్రభుత్వం తిరిగి ఎన్నికలు నిర్వ హించలేదు.

ఎంపీపీల స్థానంలో ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించినా సమావేశాలు మాత్రం నిర్వహించని పరిస్థితి. పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో కార్యదర్శులు మినహా ఇతర శాఖల అధికారులు పర్య టించిన దాఖలాలు కన్పించడం లేదు. ఇటీవల ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా వారిలో చాలా మంది కొత్తవారే ఎన్నికయ్యారు. దీంతో చాలామంది సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తే స్థానికంగా ఉన్న సమస్యలను ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకొచ్చే అవకాశముండేది.

సమస్యల పరిష్కారంపై ఆశలు..
రెండేళ్ల జాప్యం తర్వాత ఎట్టకేలకు సర్వసభ్య సమావేశా లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మం డల ప్రత్యేకాధికారి అధ్యక్షతన ప్రతి 45 రోజులకోసారి నిర్వహించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులంతా హాజరుకానున్నారు. దీంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచ్లు వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశముంటుంది. తద్వారా వాటి పరిష్కారానికి మోక్షం లభించే అవకాశముంటుంది. అలాగే పల్లె పాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు అవగాహన కల్పించేలా ఈ సమావేశాల ద్వారా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -