– మెయితీల ఆకృత్యాలకు పాలకుల వత్తాసు
– అమిత్‌షా పర్యటన తర్వాత పెరిగిన హింస: ప్రొఫెసర్ హరగోపాల్
నవతెలంగాణ-బంజారాహిల్స్
మణిపూర్‌లో విస్తారంగా ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టడానికి సాగుతున్న కుట్ర ఫలితంగానే అక్కడ హింస చెలరేగుతోందని రాజకీయ శాస్త్రవేత్త, హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా (మెఫి) మంగళవారం ఏర్పాటు చేసిన ‘మెఫి టేక్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందిన మెయితీ తెగ వారిని రెచ్చగొట్టి, వారి ఆకృత్యాలకు కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. విభజించి పాలించు సిద్ధాంతాన్ని పాటిస్తున్న ప్రభుత్వాలు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుండటం వల్లే హింస మరింత పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార వర్గాలకు సన్నిహితంగా ఉన్న మెయితీలకు దొడ్డిదారిన ప్రభుత్వ ఆయుధాలు అందుతున్నా స్థానిక పోలీసులు, పారా మిలిటరీ బలగాలు మౌనం పాటిస్తున్నాయని ఆరోపించారు. మూడు వేల నుంచి నాలుగు వేల దాకా తుపాకులను, రెండు నుంచి మూడు లక్షల దాకా బుల్లెట్లను మెయితీలు లూటీ చేస్తే.. తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన భద్రతా దళాలు ఆయుధాలు అప్పజెప్పండి అంటూ ప్రాధేయపడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటిదాకా మణిపూర్ రాజధాని ఇంఫాలో, పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులతో ధనికులుగా మారిన మెయితీలు ఇప్పుడు కొండ ప్రాంతాల్లోని అటవీ సంపదపై కన్నేశారని తెలిపారు. వాస్తవానికి కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా మణిపూర్‌లో పర్యటించిన తర్వాతే అక్కడ ఘర్షణలు మరింత ఎక్కువయ్యాయని చెప్పారు. దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలన్న ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యాలను సాధించడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
గుజరాత్‌లో జరిగిన నరమేధం కానీ, ఇప్పుడు మణిపూర్‌లో జరుగుతున్న దురాఘతాలు కానీ అందులో భాగమేనని చెప్పారు. క్రిస్టియన్‌లైన కుకీలకు చెందిన 300 చర్చీలను మెయితీలు కూల్చేయడం దారుణమన్నారు.
ఈ కార్యక్రమానికి మెఫీ ట్రస్టీ, సీనియర్ జర్నలిస్టు, ఆలపాటి సురేష్ కుమార్ అధ్యక్షత వహించారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి వందన సమర్పణ చేశారు.
మెఫీ మేనేజింగ్ ట్రస్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రెస్‌క్లబ్ కోశాధికారి ఏ రాజేష్, పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.