మణిపూర్‌లో మహిళలపై హింస

– అత్యంత దుర్మార్గం..
– ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ మహిళా విభాగం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగించి, ఆ తర్వాత లైంగిక దాడి చేయటాన్ని ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ హైదరాబాద్‌ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి జి తిరపతయ్య, మహిళా విభాగం కన్వీనర్‌ వి మైథిలి గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. దోషులను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ లోని జాతుల కలహాలు ఇద్దరు యువతులను వివస్త్రలను చేసే స్థాయికి దిగజారింటే విశ్వ గురువులమని ప్రగల్బాలు పలికే పెద్దల పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతోందని విమర్శించారు. ఇది సభ్య సమాజం తలదించుకునే సంఘటనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన సదరు వ్యక్తుల పైన లేదా రెండు జాతుల సమూహాలకు సంబంధించినది మాత్రమే కాదని గుర్తుచేశారు. ఈ కర్కశత్వం పీఠాధిపతుల, పాలనాధిపతుల విధానాల ఫలితమని గుర్తించకపోతే అంతకుమించిన అపకారం మరొకటి లేదని హెచ్చరించారు. బయటపడిన సంఘటనను పక్కనపెట్టి అది ప్రసారమవుతున్న సోషల్‌ మీడియా సంస్థలపై కన్నెర్ర చేయడం ఏ రకమైన విజ్ఞతని ప్రశ్నించారు. మూడు మాసాలుగా చెలరేగుతున్న మణిపూర్‌ హింసాత్మక ఘటనలను నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య మరింత జటిలమై దేశ ఉనికికే ప్రమాదం వచ్చేలా ఉన్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తగు రీతిలో స్పందించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా డిమాండ్‌ చేశారు.

Spread the love