కథలు జీవితాలకు అక్షర రూపాలు.. భ్రమ ప్రపంచపు ఊహాత్మక కల్పనలకంటే వాస్తవాధారిత గాధల్లో పాత్రలు చాలాకాలం గుర్తుండిపోతాయి. సమాజంలో తారసపడే సంఘటనలు ఎదురయ్యే దశ్యాల్లో ఆయా కథల తాలూకు పాత్రలు వెంటనే పోలికగా గుర్తొస్తాయి.
కొన్ని పాత్రలైనా సెటిలయ్యాయంటే వాటిని సష్టించిన రచయిత ఆశయం నెరవేరినట్టే. ప్రముఖ కవి కథకుడు శ్రీనివాస్ గౌడ్ ఇటీవల వెలువరించిన మార్జినోళ్ల కథల్లో పాత్రలన్నీ మన చుట్టూ ఉన్న జీవితాలే అనిపిస్తుంది. ఈ కథల్లో పాత్రలు అణగారిన, అణగదొక్కబడిన పీడిత, బాధిత వ్యక్తుల నిదర్శనాలు.. పీడనను ఎదురిస్తూ విముక్తికోసం గొంతెత్తిన పిడికిళ్లు బిగించిన స్ఫూర్తి రూపాలు.
ప్రతిభా సాహిత్యాన్ని ప్రోత్సహించే అన్వీక్షికి సంస్థ వెలువరించిన ఈ 144 పేజీల పుస్తకంలో 12 కథలు ఉన్నాయి. తక్కువ కథలే ఉన్నా వస్తువు, శిల్పాల పరంగా ఎక్కువ కాలం గుర్తుండిపోతాయి. పరిమిత కథలే కావటాన పాఠకులను ఇట్టే చదివించి ఎక్కువగా ఆలోచింపచేస్తాయి. కరోనా, తదితర ఇటీవలి సందర్భాల్లో రాసిన రెండు మూడు మినహా కథలు ఎక్కువగా 80, 90 దశకాల నాటివి అనిపిస్తాయి. అయినా ఏమాత్రం ప్రాసంగిత కోల్పోలేదు. నేటికీ అవే పరిస్థితులు సమాజం చుట్టూ ఆవరించి ఉన్నాయి.
‘పీటముడి, మార్జినోళ్ళు, దేవుళ్ళాట, గాలికి లేచిన ఆకులు, లీల, తిరనాళ, రెటమతం మడిసి, వ్యవహారం, సమాధి, నాకొడుకు, లచ్చిమి, దిక్కుతెలీని పక్షులు, కదిలిపోతున్న నేల’ అనే కథల్లో దిగువ మధ్యతరగతి జీవితాలను ఆవిష్కరించిన తీరులో అత్యంత సహజత్వం ఉంది. తన చుట్టూ వున్న జీవితానుభవాలు పట్టించుకోవటం, పరిశీలించటం స్నేహం చేసిన దగ్గరితనం అనుభూతుల నుంచే ఈ సహజత్వం సిద్ధిస్తుంది.
జీవితాల్లో పెనుగులాటలు సంఘర్షణలు, అపోహలు, భ్రమలు, ఆశలు, నిరాశలు. నిట్టూర్పులు పోరాట తత్వాలు సమస్య ఏదైనా సరే తాత్కాలికమేనని పోరాడటం ద్వారా, ఎదురించటం వల్ల ఆపదలనుంచి గట్టెక్కగలమని నిరూపిస్తాయి పాత్రలు.
రచయిత సమాజిక పరిశీలకుడు. అనుభవ జీవితానికి అదనంగా పొందిన పరిశీలనానుభశాలి. సాహిత్య రంగంలో సైతం నిత్య అధ్యయనం తనది. కవి, అనువాదకుడు, పలుభాషల్లోని సాహిత్య సౌందర్యాన్నీ తెలుగుకు తర్జుమా చేస్తాడు.. ఇంత పరిశోధన కారణంగా తన రచనా పరిధి, ప్రతిభా స్థాయి ఈ సంపుటితో మరింత అధికమయ్యింది.
ఈ పుస్తకానికి ముందుమాటల హడావిడి ఏమీ లేకుండానే నేరుగా కథల్లోకి ప్రవేశించనివ్వటం పాఠకులకు హాయినిస్తుంది. అయితే వెనుక అట్టముందు విలువైన బ్లర్బ్‌తో దర్శనమిచ్చిన ప్రముఖ కవి కథకుడు అఫ్సర్ తన వాక్యల్లో రచయిత సాహిత్య ప్రత్యేకతను ఈ కథల ప్రాధాన్యతను మరింత తేటతెల్లంగా రాశారు.
పాత్రల ఔచిత్యాల మేరకు స్థానిక భాషను వాడటం వల్ల ఈ కథల్లో మాండలిక, భాష సొగసు చోటుచేసుకుంది. ఆధునిక సమాజం కబళిస్తున్న అనేక పదాలను ఈ రచయిత నమోదు చేయటం అభినందనీయం. భవిష్యత్ తరాలకు, భాషా పరిశీలకులకు పరిశోధకులకు ప్రయోజనం కలిగించే చర్య ఇది. ఈ కథలన్నీ విముక్తికోసం అని రచయిత స్పష్టం చేసినట్టు ఇవి రచయితను ఏళ్లకాలంగా అంతరంగంలో వేధిస్తున్న, బయటపడినవే కాదు. పీడన, దోపిడీ సంకెళ్ళు తెంచుకున్నవి కూడా.
ప్రతిమనిషిలోనూ మంచినే తప్ప చెడు చూడవద్దని ఒకమాట, ఒక చర్య ఆధారంగా మనిషి గుణాన్ని ఖరారు చేయవద్దని పీటముడి కథ తెలియజేస్తుంది. పోరాటం నేర్పేవాళ్ళు ఎర్ర జెండాలు ఎర్ర చొక్కాలతోనే రానక్కరలేదని నరసమ్మ పాత్ర నిరూపిస్తుంది. టైటిల్ కథ మార్జినోళ్ళు ఇటీవల ట్రెండ్ గా మారిన తమిళ్, సినిమాల కోవలో ఉంది. రైల్వే ట్రాక్ వెంట గుడిసెలు వేసుకున్న బడుగుల పోరాటం అత్యంత సహజంగా ఉంది.
రెటమతం మడిసి అనే కథలో మనిషి మరో కోణాన్ని ఆవిష్కరించింది. పెడసరంగా వ్యవహరించే వెంకటేశ్వర్లులో పొందిన మేలు మరిచిపోని కతజ్ఞతా గుణాన్ని వెలికి తీస్తుంది. ఇంకా మిగిలిన కథలన్నీ వేటికవే ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.
ముఖ్యంగా ఈ కథలను కథలు రాయాలనుకుంటున్న సందిగ్దాలకు గురవుతున్న ఔత్సాహికులు చదవాలి. అతి సులభంగా కథలు ఎలా రాయొచ్చో ఇవి పాఠం నేర్పుతాయి. వీటిల్లో చాలా కథలు మేగజైన్లు, వెబ్ పత్రికల్లో ప్రచురితం కావటమేకాదు, కొన్ని పోటీల్లో బహుమతులు అందుకున్నవీ ఉన్నాయి. కనుక సాధారణ కథాభిమానులేకాక వర్దమాన కథకులకు దారి దివిటీలు.
– శ్రీనివాస్ సూఫీ, 9640311380.
పీడిత బతుకుచిత్రాలు మార్జినోళ్ళు కథలు
10:32 pm