ఏడడుగులు వేయకుంటే వివాహం చెల్లదు

నవతెలంగాణ- అలహబాద్‌: ఏడడుగులు, ఇతర సంప్రదాయ తంతు నిర్వహించకుండా జరిగే హిందూ వివాహం చెల్లుబాటు కాదాని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొన్నది. తనకు విడాకులు ఇవ్వకుండా తనను వదిలేసి తన భార్య ఇంకో వివాహం చేసుకుందని ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. వధువు, వరుడు కలిసి నడిచే సప్తపది అన్నది హిందూ చట్టంలో అత్యంత ముఖ్యమైన తంతు. అయితే ఫిర్యాదుదారు ఆరోపించినట్టుగా అలాంటిది జరిగినట్టు కన్పించడం లేదని కేసును విచారించిన జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.  వివరాల్లోకి వెళితే.. స్మృతి సింగ్‌కు సత్యం సింగ్‌తో 2017లో పెండ్లి జరిగింది. అయితే భర్త వేధింపులతో ఇల్లు విడిచి వెళ్లిన స్మృతి అతనిపై కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. విచారణ చేసిన పోలీసులు భర్త సత్యం సింగ్‌, అత్తమామలపై కేసు నమోదు చేశారు. అయితే తన భార్య రెండో పెండ్లి చేసుకుందని, అందుకే ఇలా కేసు పెట్టిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు జరిపి అది అబద్ధమని నిర్ధారించారు.

Spread the love