నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరంలో ఆదివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి తర్వాత చినుకులతో మొదలై.. ఉదయం 6 గంటల నుంచి గంటన్నర పాటు దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అమీర్‌పేట, మైత్రీవనం, మయూర్ మార్గ్‌తో పాటు పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై భారీగా వరద నిలిచిపోవడంతో ఉదయం బయటకు వచ్చిన వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు భవనాల్లో సెల్లార్లలోకి, నార్సింగ్ మున్సిపాలిటీ బాలాజీనగర్ కాలనీలో పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పందెంవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా స్కూల్ లకు సెలవు ప్రకటించారు. ఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. అత్యధికంగా డిచ్ పల్లి మండలం గన్నారం లో 14 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. గాంధారి, సిరికొండ లో 12 సెంటిమీటర్లు అయింది. సదా శివ నగర్ జుక్కల్ , జక్రాన్ పల్లి లో 11 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. డిచ్ పల్లి, మదన్ పల్లి లో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. జిల్లా కేంద్రం లో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తరుణంలోనే ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా స్కూల్ లకు సెలవు ప్రకటించారు. లోకల్ హాలి డే గా ప్రకటించారు విద్యాశాఖ అధికారులు.