సబ్సిడీలకు మంగళం

– నాలుగేళ్లుగా నిలిచిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం
– పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్న రైతులు
– సబ్సిడీ పథకాలు అమలు చేయాలని రైతుల డిమాండ్‌
నవతెలంగాణ-ఆమనగల్‌
రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామంటున్న ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని పలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా ప్రారంభమైన గత నాలుగేళ్లుగా సబ్సిడీ పథకాలను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకంతో పాటు విత్తనాలపై ఇచ్చే సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేసింది. ఈ విషయమై రైతులు కూడా పలు సందర్భాల్లో సబ్సిడీ పథకాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదు పలు రైతు సంఘాలు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సైతం సబ్సిడీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు తిరిగి యాంత్రికరణ కామ విత్తనాలపై సబ్సిడీలను పునరుద్ధరించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
రైతులపై మోయలేని భారం
గతంలో అమలు చేసిన యాంత్రికరణ పథకంలో భాగంగా ట్రాక్టర్లు, టిల్లర్లు, రోటోవేటర్లు, టార్పాలిన్లు, నాగళ్లు, విత్తనాలు వెదజల్లే మిషన్లను స్ప్రేయర్లు తదితర యాంత్రీకరణ పనిముట్లను రైతులకు 50 శాతం సబ్సిడీపై ఇచ్చేవారు. దీనికి తోడు వరి, కంది, పెసర, మినుము, ఆముదం, వేరుశనగ విత్తనాలను కూడా సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసింది. దీంతో పొలాలు చదును చేయడం, దుక్కుల దున్నకంతో పాటు విత్తనాల కొనుగోలు కోసం రైతులు మోయలేని భారాన్ని మోస్తున్నారు. సబ్సిడీ పథకాలను అమలు చేయడం వల్ల రైతులకు సగం ధరకే ట్రాక్టర్లు ఇతర యంత్రాలు వచ్చేవి దాంతో రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేవారు. ప్రస్తుతం సబ్సిడీలు లేకపోవడంతో రైతులు పూర్తి ధరను చెల్లించి విత్తనాలు, యంత్రాలను, కొనుగోలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పట్టిపీడిస్తున్న కూలీల కొరత
వ్యవసాయ రంగాన్ని కూలీల కొరత పట్టి పీడిస్తోంది. యాంత్రికరణ పథకాన్ని అమలు చేయడం ద్వారా కూలీల కొరతను అధిగమించవచ్చని రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. యాంత్రికరణలో కోత మిషన్లు, ట్రాక్టర్లు, ట్రిల్లర్లతో పాటు మందులను స్ప్రే చేయడానికి డ్రోన్లను కూడా సబ్సిడీపై రైతులకు అందజేయాలని వారు కోరుతున్నారు. సబ్సిడీ పథకాన్ని అమలు చేయాలి. వ్యవసాయ రంగాన్ని కూలీల కొరత పట్టి పీడిస్తోంది. కూలీలు దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారు యాంత్రికరణ పథకాన్ని తిరిగి ప్రారంభించాలి. రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు వరికోత మిషన్లతో పాటు డ్రోన్లను ఇచ్చి యువతకు ఉపాధిని కల్పించాలి కేంద్రం కూడా సబ్సిడీ వాటాను విడుదల చేయాలి.
– కాన్గుల వెంకటయ్య
సీపీఐ(ఎం) నాయకులు ఆమనగల్‌

Spread the love