నేను బతికుండగా రైతుబంధు ఆగుద్దా..!

నేను బతికుండగా రైతుబంధు ఆగుద్దా..!– 30న ఓట్లు పడుడే… 3న కారు గెలిచుడే…6న డబ్బులు పడుడే
– బీజేపీకి ఓటు వేస్తే మోరీలో వేసినట్టే..
– అసైన్డ్‌ భూముల పట్టాలపై తొలి సంతకం : షాద్‌నగర్‌, చేవెళ్ల, అందోల్‌, సంగారెడ్డి ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ- మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి/ షాద్‌నగర్‌, చేవెళ్ల
‘కేసీఆర్‌ బతికుండగా రైతుబంధు ఆగుద్దా..? రైతుబంధు డబ్బులివ్వొద్దని కాంగ్రెసోళ్లు కుట్రలు చేసి ఆపిండ్రు. న్యాయ పోరాటం చేస్తే 28న ఇచ్చేందుకు ఈసీ అనుమతిచ్చింది. ఇంతలో మరో కాంగ్రెసోడు మళ్లీ ఫిర్యాదు చేసి ఆపిండు. ఇట్ల ఎన్ని రోజులు ఆపుతరు. 30న ఓట్లు పడుడేనాయే.. 3న కారు గెలుచుడేనాయే.. 6న రైతుబంధు డబ్బులిచ్చుడేనాయే.. దాంతోపాటు అసైన్డ్‌ భూములకు పట్టాల కోసం తొలి సతకం చేస్తా..’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. సోమవారం సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఓటు మన తలరాతను మార్చుతుందని, వచ్చే ఐదేండ్లు మనందరి భవిష్యత్‌ను నిర్ణయించేది ఓటేనని అందోల్‌, సంగారెడ్డి సభల్లో సీఎం చెప్పారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల గుణగణాలతోపాటు ఆయా పార్టీల చరిత్రను కూడా చూడాలన్నారు. రైతు బంధు దుబారా ఖర్చు అని చెబుతున్న కాంగ్రెసోళ్లు ఈసీకి ఫిర్యాదు చేసి రైతులకు డబ్బులేయకుండా చేశారన్నారు. న్యాయ పోరాటం చేసి ఈసీ అనుమతి తెచ్చుకుంటే మళ్లీ వాళ్లే ఫిర్యాదు చేసి డబ్బులివ్వకుండా అడ్డుకున్నారన్నారు. ఇట్ల ఎన్ని రోజులని రైతుబంధును ఆపుతారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ గెల్వంగనే డిసెంబర్‌ 6న టింగ్‌ టింగ్‌మని రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయన్నారు. ఇందిరమ్మ రాజ్యం సక్కగుంటే ఎన్టీఆర్‌ పార్టీ ఎందుకు పట్టేవారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో సాగిన రక్తపాతం మళ్లీ కావాల్నా అని ప్రశ్నించారు. దేశంలో 158 మెడికల్‌ కళాశాలు ఇచ్చిన బీజేపీ.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. అలాంటి బీజేపీకి ఓటు ఎందుకు వేయాలన్నారు. బీజేపీకి వేసే ఓటు మోరీలో వేసినట్లే అవుతుందన్నారు. సంగారెడ్డి జిల్లాలో తలాపున సింగూరున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అందోల్‌, సంగారెడ్డికి తాగు, సాగునీరు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. అందోల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి క్రాంతిని గెలిపిస్తే నియోజకవర్గంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద దళితులందరికీ ఒకేసారి దళితబంధు అమలు చేస్తామన్నారు. సంగారెడ్డిలో పోలింగ్‌ బూతుల్ని ఆక్రమించి రిగ్గింగ్‌ చేసే ఎమ్మెల్యే కావాల్నా ఓడిపోయినా ప్రజల మధ్య ఉండి సేవ చేస్తున్న చింత ప్రభాకర్‌ కావాల్నా ఆలోచించుకుని ఓటు వేయాలని కోరారు. సేవాలాల్‌ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటిస్తామన్నారు.
అసైన్డ్‌ భూముల పట్టాలకు తొలి క్యాబినెట్‌లోనే ఆమోదం
అసైన్డ్‌ భూముల పట్టాలను రాబోయే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొలి క్యాబినెట్‌ భేటీలోనే ఆమోదిస్తామని షాద్‌నగర్‌, చేవెళ్ల సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని, అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆదరించి గెలిపించాలని కోరారు.
షాద్‌నగర్‌ వరకు మెట్రో విస్తరిస్తామన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌లో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 111జీఓ రద్దు చేశామని, హైదరాబాద్‌ చుట్టూ మాస్టర్‌ ప్లాన్‌ చేయాల్సి ఉందని, అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ‘నేను అందరికీ అర్డర్‌ వేస్తే.. ఎమ్మెల్యే కాలే యాదయ్య మాత్రం నాకు అర్డర్‌ వేస్తాడు. నా దగ్గరికి రాగానే ఏం ఆర్డరో చెప్పు అని అంటా’ అని సీఎం వ్యాఖ్యానించారు.

Spread the love