– ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ ఎక్కడ ?
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల పరిధిలోని జానకీపురం గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మయ్య (40) పురుగు మెందు తాగి శనివారం మృతి చెందడంతో అయన స్వగ్రామం జానికీపురంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తున్న సందర్భంగా అశ్వారావుపేట మాజీ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరావు పిట్టల లక్ష్మయ్య భౌతికకాయానికి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిట్టల లక్ష్మయ్య వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పులు తీర్చలేక పురుగు మందు తాగాలసి వచ్చిందని, గత ప్రభుత్వంలో రైతులను అనేక విధాలుగా ఆదుకొని వారికి అండగా వుందన్నారు. మృతి చెందిన రైతులకు రైతు భీమా అందించాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు, ఉద్యోగస్తులకు రక్షణ లేకుండా పోయిందని, ఒక్క రోజు వ్యవధిలోనే నియెజకవర్గంలో రైతు, సబ్ ఇన్స్పెక్టర్ చనిపోవడం చాలా బాధాకరం అని ఈ రెండు మరణాలకు ప్రభుత్వమే సంధానం చెప్పాలని అన్నారు. చనిపోయిన పిట్టల లక్ష్మయ్య కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ హాస్పటల్కి పోస్టుమార్టం నిమిత్తం తీసుకుపోతే పోస్టుమార్టం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొకొని సుమారు 24 గంటలు తరువాత పోస్టుమార్టం నిర్వహించడం చాల బాధాకరం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అనేది లేకుండా ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి కుటుంబ సమస్యలు పరస్కరించిన సబ్ ఇన్స్పెక్టర్ శ్రీరాములు శ్రీనివాస్ చివరకి మరణమే శరణ్యం అని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా బాధాకరం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు విషయంలో విఫలమైందని వారి మరణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించి వారి కుటుంబాలకు రూ.50 లక్షలు ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో అయిన ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి అని అన్నారు.