వైద్యసేవలు అందుబాటులోకి తేవాలి

– రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు
నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రభుత్వం మంజూరు చేసిన పల్లె, బస్తీ దవఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్‌ సెంటర్‌లు త్వరగా పూర్తిచేసి నిర్దేశిత వైద్య సేవలను ప్రజలకు అందుబాటు లోకి తేవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర స్థాయి వైద్య శాఖ ఉన్నత శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్‌లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో జిల్లాలలో ప్రజలకు అం దుతున్న వైద్య సేవలపై ఆయన సమీక్షించి మాట్లాడారు. గర్భిణీల్లో అనేమియా సమస్య పరిష్కరించేందుకు కెసిఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకం అమలులో ఉందన్నారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 9జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసామని, మిగిలిన 24 జిల్లాలకు విస్తరిస్తున్నామని అ న్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా కెసి ఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకం లాంచ్‌ చేయాలని తెలిపారు. కెసిఆర్‌ కిట్‌ పథకం వల్ల ఎంఎంఆర్‌, ఐఎంఆర్‌ రేట్ల నియం త్రణలో దేశంలో 3వ స్థానంలో నిలిచామని అన్నారు. 100 శాతం ఇన్సిస్టిట్యూషన్‌ డెలీవరిలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అఆన్నరు. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 2038 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్‌ సెంటర్‌ లను మంజూరు చేశామని, 422 సబ్‌ సెంటర్‌ నిర్మాణ పనులు పూర్తి చేశామని, మరో 177 పనులు చివరి దశలో ఉన్నాయని , 610 నిర్మాణ పనులు వివిధ దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. సబ్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి నిధుల సమస్య లేనందున త్వరితగతిన 766 సబ్‌ సెంటర్ల టెండర్ల ప్రక్రియ ఫైనల్‌ చేసి పనులు ప్రారంభించాలని, సబ్‌ సెంటర్‌ లను త్వరితగతిన వేగంగా నిర్మించి ప్రజలకు అం దుబాటులోకి తీసుకొని రావాలని ఆదేశించారు. జిల్లాలకు నూతనంగా మంజూరు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలు, బస్తీ దవఖానాలు, పల్లె దవాఖానాలు, డయాగ్నోస్టిక్‌ హబ్‌ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3208 పల్లె దవాఖానాలకు గాను ఇప్పటికే 2995 మైల్డ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లను నియమించామని, ప్రస్తుతం ఖాళీగా ఉన్న 211 పోస్టులను జిల్లా స్థాయిలో భర్తీ చేయాలని తెలిపారు. 80 పనిదినాలు లో రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర మంది ప్రజలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కంటి పరీక్షలను విజయవంతంగా నిర్వహించినం దుకు కలెక్టర్లను, వైద్య సిబ్బందిని అభినందించారు. రాష్ట్రంలో 1.5 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 21.4 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసెస్‌, 17.08 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్‌ గ్లాసెస్‌ పంపిణీ చేశామని తెలిపారు. సిపిఆర్‌ శిక్షణ పై వైద్యాధికారులు శ్రద్ధ వహించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 15 రోజుల పాటు తీవ్రమైన ఎండలు ఉంటాయని, వడదెబ్బ బారిన ప్రజలు పడకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. వీడియో సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్‌ సెంటర్‌ నిర్మాణ పనులకు త్వరగా టెండర్‌ పూర్తి చేసి ప్రారంభిస్తామని, ఇటీవలే 6 మైల్డ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌ ని భర్తీ చేశామని, వారం రోజులలో మిగిలిన 20 ఖాళీలు భర్తీ చేసి పల్లె దవఖానాలు ప్రారంభించి ప్రజలకు సేవలు అందిస్తామని పేర్కొన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రీరామ్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ తిరుపతి, సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Spread the love