నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో అధికారుల భాగస్వామ్యం బేష్ అంటున్నారు పసర గ్రామ ప్రజలు. పసర గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ గతంలో వర్షం పడితే బురద బురదగా ఉండేది. విద్యార్థులు నడవడానికి ఇబ్బందిగా ఉండేది. ఆడుకోవడానికి అనుకూలంగా ఉండేది అసలే కాదు. అలాంటిది విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన ఊరు మనబడి కార్యక్రమంలో అభివృద్ధి శర వేగంగా జరుగుతోంది. దీనిలో భాగంగా గత రెండు రోజులుగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశానుసారం స్థానిక తహసిల్దార్ అల్లం రాజకుమార్ మరియు తాహసిల్దార్ సత్యనారాయణ లు మన ఊరు మనబడి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ములుగు తహసిల్దార్ సత్యనారాయణ ములుగు నుండి ఎనిమిది టిప్పర్లను పంపించగా స్థానిక తహసిల్దార్ అల్లం రాజకుమార్ లు మరియు ఆర్ఐ రాజేందర్ వీఆర్ఏలు మండలంలోని చల్వాయి గౌరారం చెరువు నుండి సుమారు 40 టిప్పర్ల మట్టిని తరలించారు. తరలించిన మట్టిని వెంటనే డోజర్ సహాయంతో లెవెల్ చేస్తూ పాఠశాల ఆవరణ రూపురేఖలను మారుస్తున్నారు. అధికారుల పనితీరును చూసి ప్రజలు హర్షద్వానాలు పలుకుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారు 90 శాతం పాఠశాలలు వర్షాకాలంలో నీటిమయం అవుతూ విద్యార్థులకు ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఇంత మంచి అధికారులు ఇంకా మంచి చేసుకుని పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. పాఠశాలలు మెరుగుపడితే సామాన్య కుటుంబీకుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు ముందుకు వస్తారని పలువురు అంటున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారవుతున్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనంగా మండలంలో నిలువనుంది.