ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లు పెంచాలి

నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రభుత్వ పాఠశాలలో కొత్త అడ్మిషన్లు పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి పాణిని అన్నారు. శనివారం మండల విద్యా వనరుల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం గోవిందరావుపేట మండల విద్యాశాఖ అధికారి గొండి దివాకర్ అధ్యక్షతన నిర్వహించగా, ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని ముఖ్య అతిథిగా హాజరై బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం డీఈవో గారు మాట్లాడుతూ జిల్లాలోని ప్రధానోపాధ్యాయులందరూ మరియు ఉపాధ్యాయ బృందం అంకిత భావంతో పనిచేసి బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఇంటింటి సర్వే చేసి బడి ఈడు పిల్లలను, బడి బయట ఉన్నటువంటి పిల్లలను గుర్తించి వీఈఆర్ రిజిస్టర్ నమోదు అప్డేట్ చేయాలని సూచించారు. మరియు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలను, మన ఊరు -మనబడి అభివృద్ధిని, ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు నోటు పుస్తకాల పంపిణీ, రెండు జతల ఏకరూప దుస్తులు మరియు అర్హత గల విద్యార్థులకు ఉపకార వేతనాలు వంటి సదుపాయాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అధిక సంఖ్యలో అడ్మిషన్లు నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం, సన్న బియ్యం పోషకాలతో కూడిన ఉచిత మధ్యాహ్న భోజనం, మన ఊరు మన బడి పథకంలో చేసిన అభివృద్ధి డిజిటల్ క్లాస్ రూమ్ గూర్చి ప్రజలకు తెలుపాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు బద్దం సుదర్శన్ రెడ్డి, రాజు, సాంబయ్య, మండల విద్యాశాఖ అధికారి గొండి దివాకర్, స్థానిక బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అన్నా మేరీ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘురాం, ఉపాధ్యాయ బృందం, మండల విద్యా వనరుల కేంద్రం సిబ్బంది విష్ణు, బిక్షపతి, చందు మరియు డిసిఇబి సహాయ కార్యదర్శి విక్రమ్ రాజ్,లఅంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love