– పెండింగ్ సమస్యలు, మధ్యంతర నివేదికపై చర్చ
– కమిటీకి మంత్రి పొంగులేటి దిశా నిర్దేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ధరణి సమస్యలపై చర్చించేందుకు బుధవారం సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లతో సీసీఎల్‌ఏలో ధరణి కమిటీ సమావేశం కానుంది. కలెక్టర్ల భేటీలో చర్చించే అంశాలపై మంగళవారం రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ధరణి కమిటీ మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి వారికి పలు సూచనలు చేసినట్టు సమాచారం. రెవెన్యూ లెక్కల ప్రకారం ధరణి పోర్టల్‌లో ప్రస్తుతం 2.31 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 1.8 లక్షల ఎకరాల భూములకు సంబంధించి డిజిటల్ సంతకాల (డీఎస్) కోసం భూ యాజమానులు ఎదురు చూస్తున్నారు. ఇవే కాకుండా సాదా బైనామా కోసం 9.5 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు ధరణి పోర్టల్‌లో ప్రస్తుతం అవకాశం లేదు. ఇందులోని సమస్యలను కమిటీ రెండు భాగాలుగా విభజించింది. ప్రస్తుతం సర్వే నెంబరు మిస్సింగ్, ఎక్స్‌టెన్షన్ కరెక్షన్ చేయాలంటే ఆ ఫైలు సీసీఎల్‌ఏ వరకు వెళ్లాల్సి వస్తోంది. డిజిటల్ పాస్‌బుక్ మొదటి పేజీలో తప్పులు సరిచేయించుకోవాలంటే కలెక్టర్‌ను ఆశ్రయించాలి. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను సరిచేయించుకునేం దుకు యజమానులు నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తాత్కాలిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం తదితర వివరాలతో మద్యంతర నివేధిక ఇవ్వాలని మంత్రి వారికి సూచించినట్టు తెలుస్తోంది. కలెక్టర్ల సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఆ కమిటీ కన్వినర్ సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం సర్క్యూలర్ జారీ చేశారు. ఎమ్మారో, ఆర్డీవో విచారణలు, వారి పరిధిలో పరిష్కారం అయ్యే అంశాలు, న్యాయ సంబంధమైన వివాదాలు, నిజామాబాద్ భూ భారతి స్టేటస్ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సమస్యలపై కమిటీ లోతుగా అధ్యయనం చేసి ఈ నెలాఖరు వరకు మధ్యంతర నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.