మెక్సికో కొత్త అధ్యక్షురాలు షీన్‌ బామ్‌

మెక్సికో కొత్త అధ్యక్షురాలు షీన్‌ బామ్‌– మితవాదులకు శృంగభంగం
మెక్సికో సిటీ: మెక్సికో తదుపరి అధ్యక్షురాలిగా ప్రగతిశీలవాది డా. క్లాడియా షీన్‌బామ్‌ తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. సైంటిస్టు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, హక్కుల కార్యకర్త అయిన ఆమె మెక్సికోను నయా ఉదారవాద విధానాలకు తావులేని ప్రత్యామ్నాయ ఆర్థికాభివృద్ధి నమూనాతో ముందుకు సాగుతానని ప్రకటించారు. తన సహచరుడు, ప్రస్తుత అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రడార్‌ (ఆమ్లో) అనుసరించిన ప్రజానుకూల విధానాలను కొనసాగిస్తానని చెప్పారు. అక్టోబర్‌ 1న నూతన అధ్యక్ష బాధ్యతలను ఆమె చేపడతారు. మొరెనా (మూవ్‌మెంట్‌ ఫర్‌ నేషనల్‌ రిజనరేషన్‌) పార్టీకి చెందిన 61 ఏళ్ల షీన్‌బామ్‌ లేబర్‌ పార్టీ (పిటి), గ్రీన్‌ ఎకాలజిస్ట్‌ పార్టీ ఆఫ్‌ మెక్సికో కలిసి ‘లెట్స్‌ కంటిన్యూ మేకింగ్‌ హిస్టరీ’ అనే కూటమిని ఏర్పాటు చేసి ఆ కూటమి తరపున బరిలోకి దిగి 58 శాతం ఓట్లతో విజయపతాక ఎగురవేశారు. ఆమె ప్రధాన ప్రత్యర్థి, మితవాద కూటమి (పిఆర్‌ఐ, పిఎఎన్‌, పిఆర్‌డి) కి చెందిన సోచితిల్‌ గాల్వెజ్‌ 28 శాతం ఓట్లతో చాలా వెనుకబడిపోయారు. సిటిజెన్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ అభ్యర్థి జోర్గె అల్వారెజ్‌ 10శాతం ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. మెక్సికో జాతీయ ఎన్నికల సంఘం ఫలితాలను వెల్లడించిన వెంటనే షీన్‌ బామ్‌ వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.”ఈ విజయం నాకు చాలా ఆనందం కలిగించింది. ఒక మహిళ ఈ అత్యున్నత స్థానానికి చేరుకోవడం 200 ఏళ్ల దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఈ విజయం చేకూర్చిన మీకందరికీ కృతజ్ఞతలు. ఆమ్లో ప్రవేశపెట్టిన ‘ఫోర్త్‌ ట్రాన్సఫర్మేషన్‌’ (నాల్గవ పరివర్తన) పంథాలో ముందుకు సాగుదాం” అని ఆమె అన్నారు. మెక్సికో అధ్యక్షపదవితోబాటు, పార్లమెంటులో దిగువ సభ అయిన చాంబర్‌ ఆఫ్‌ డిప్యూటీస్‌ (ఎంపీలు), సెనేట్‌, తొమ్మిది రాష్ట్రాల గవర్నర్ల పదవులకు, వివిధ నగరాల మేయర్‌ స్థానాలకు, స్థానిక అసెంబ్లీలకు ఆదివారం ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ అన్ని స్థాయిల్లోను మొరేనా పార్టీ నేతృత్వంలోని కూటమి విజయ ఢంకా మోగించడం విశేషం.

Spread the love