నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన శాఖలకు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించేందుకు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. సోమవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో బీసీ సంక్షేమం, రవాణా శాఖల ప్రతిపాదనలపై వేర్వేరుగా ఆయా శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించి గత బడ్జెట్‌లో ప్రతిపాదించిన అంశాలు, కేటాయించిన నిధులు, చేసిన ఖర్చుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గణాంకాలను వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం దానికి సంబంధించిన వివరాలు తెలిపారు. బీసీ గురుకుల పాఠశాలలు, స్కాలర్‌షిప్‌ల కోసం కేటాయించిన నిధులు, కళ్యాణ లక్ష్మి కోసం కేటాయించిన నిధుల వివరాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలకు అదనపు బడ్జెట్ ఎంత అవసరమవుతుందో అంచనాలు రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారుల్ని ఆదేశించారు. వాషర్‌మెన్ ఫెడరేషన్‌కి దోభి ఘాట్ల నిర్మాణం, విద్యుత్ సబ్సిడీ, నాయి బ్రాహ్మణుల విద్యుత్ సబ్సిడీకి ఖర్చవుతున్న నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీసీ కులగణనకు కావల్సిన నిధులపైనా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన నిధుల వివరాలు అడిగారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో బీసీ సంక్షేమానికి అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు.
రవాణాపై…
రవాణాశాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, కార్యదర్శి జ్యోతి బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీకి గతేడాది కేటాయింపులు, విడుదలైన నిధులు, చేసిన ఖర్చులు అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకం అమలు, కొత్త బస్సుల కొనుగోలు కోసం ఆర్టీసీకి అవసరమైన బడ్జెట్ కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించారు. త్వరలో ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం జరుగుతుందనీ, అప్పటికి పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారుల్ని ఆదేశించారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి పీఎఫ్, సీసీఎస్, బాండ్స్‌కి సంబంధించి బడ్జెట్ కేటాయింపులను సమీక్షించారు.
మంత్రిని కలిసిన ఏఎమ్‌వీఐ అభ్యర్థులు
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అభ్యర్థులు సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వల్ల సర్వీస్ రూల్స్‌ను మార్చేసి నోటిఫికేషన్ వేశారనీ, దానివల్ల అర్హులైన ఆటోమొబైల్ విద్యనభ్యసించిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
ఫెన్సింగ్ పోటీ విజేతలకు సన్మానం
జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పథకాలు సాధించిన బీసీ గురుకుల విద్యార్థులను సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. నల్గొండ జిల్లా తుమ్మడం బీసీ గురుకుల పాఠశాలకు చెందిన జీ భవజ్ఞ జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించగా, ముగ్గురు విద్యార్థులు ఎమ్ అక్షయ (8వ తరగతి), కె.హరిప్రియ (7వ తరగతి), జె.మనస్విని (8వ తరగతి) రజత పతకం సాధించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్‌జేపీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు , ప్రిన్సిపాల్ రాములు, పీఈటి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.