ఎండమావులు

miragesగల్లీలో పెద్ద ఎత్తున టపాకాయలు, డీజే సౌండ్‌లు, బాజాభజంత్రీలు ఇలా అన్ని రకాల హడావుడులు జరుగుతున్నాయి. చాలా సేపటి నుండి ఆ హడావుడిలోకి దూకాలని అన్పిస్తున్నా ఎందుకో ఆగిపోతున్నాడు మోహన్‌. దానికి కారణం ఉంది. శ్రీమతి ఏమన్నా అంటుందేమోనన్న అనుమానం. కాసేపటికి ఏదైతే అదయిందని హడావుడిలోకి ఎంట్రీ ఇచ్చాడు. కనీసం గంట గడిచింది. అలసిపోయి ఇంట్లోకి వచ్చాడు. శ్రీమతి ఎదురొచ్చి చాయి కప్పు అందించింది.
”కోపగించెకుంటావని అనుకున్నాను కాని కప్పు చాయి తెచ్చిచ్చావు!” అన్నాడు మోహన్‌ కొద్దిగా ఆశ్చర్యపడుతూ.
‘కోపమెందుకు? మీరు ఆనందంగా ఉన్నారు కదా! ఇంతకీ ఎందుకా బాజాభజంత్రీలు?’ అడిగింది.
”నీ కోసమేనోరు!” అన్నాడు శోభన్‌బాబులా స్టైల్‌గా
”నా కోసమైతే ఇంట్లోకి రాకుండానే వెళ్ళి పోయారేం?” అన్నది శ్రీమతి.
”నీ కోసం అంటే నీలాంటి ఆడవాళ్ళందరి కోసం!” మా పెద్దాయన పెద్దపని చేశాడు తెలుసా?” అన్నాడు గర్వంగా.
”ఏమిటీ దేశంలోని ఆడవాళ్ళందరికీ మేకిన్‌ చీర సారే పథకం పెట్టారా?” అన్నది శ్రీమతి ఉత్సాహంగా.
”నీ మొహం! బిచ్చగాడికి వరమిస్తానంటే అడుక్కోవటానికి బంగారు చిప్ప ఇవ్వమన్నాడంట! అట్లా ఉంది నీ వ్యవహారం!” విసుగ్గా అన్నాడు.
”మరి ఏ చిప్ప ఇస్తున్నారో తెలిసేలా చెప్పోచ్చు గదా?” అంది శ్రీమతి.
”నారీ శక్తి వందన్‌ ఆధినియం!” అన్నాడు.
”ఏమిటో అది పేరే అర్థం కావటం లేదు!” అన్నది శ్రీమతి గందరగోళంగా.
”అది చట్టం పేరు! మహిళలందరికీ చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కొత్త పార్లమెంటులో చేసిన చారిత్రాత్మక చట్టం!” గర్వంగా చెప్పాడు.
”ఏమండీ! ఈసారి నేను ఎంపీగా పోటీ చేస్తాను. ఆ తర్వాత మంత్రినవుతాను!” అన్నది శ్రీమతి ఉత్సాహంగా.
మోహన్‌ పగలబడి నవ్వాడు కాసేపటికి నవ్వాపుకుని ఈసారి నీవు ఎంపీ కాలేవు. మంత్రివి అంతకన్నా కాలేవు!” అన్నాడు.
”చూశారా! మీ పెద్దాయన చేసిన చట్టానికి మీరే అడ్డుపడుతున్నారు!” అన్నది శ్రీమతి.
నేను అడ్డుపడటం కాదు! చట్టం 2029లో అమలులోకి వస్తుంది అప్పటి దాకా ఇప్పుడున్నట్లే!” అన్నాడు.
”ఆలూ లేదు! కొడుకు పేరు సోమలింగం! అన్నమాట” అన్నది శ్రీమతి.
శ్రీమతి వంక అనుమానంగా చూశాడు మోహన్‌.
”నాకు తెలుసు! మీరు ఏమనుకుంటున్నారో! నేను కాంగ్రెస్‌లోనే, కమ్యూనిస్టు పార్టీలోనో చేరానని అందామనుంటున్నారు! అంతేగా!” అన్నది శ్రీమతి.
”ఖచ్చితంగా అంతే! ఏ మంచి పని చేసినా రంధ్రాన్వేషణ చేయగల సమర్థులు వారే!” అన్నాడు మోహన్‌ ఏద్దేవాగా.
ఈసారి శ్రీమతి పగలబడి పవ్వింది.
”ఎందుకు నవ్వుతున్నావు?” ఉడుక్కుంటూ అన్నాడు.
మీరు రంధ్రాన్వేషణ గురించి మాట్లాడుతుంటే నవ్వురాక మరేం వస్తుంది! మనకన్నా రెండు తరాల ముందు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న గాంధీ, నెహ్రూలు తప్పులు చేశారంటూ నిరంతరం వల్లెవేసే మీరు రంధ్రాన్వేషణ గురించి మాట్లాడుతారా? అన్నది శ్రీమతి నవ్వుతూనే.
”అంటే వారు తప్పులు చేయలేదా.. చేసిన తప్పులు చెప్పకూడదా?” అడిగాడు.
”ఆ చర్చ ఎందుకు గాని ఈ చట్టం పదేళ్ళ కిందటే మీరు ఎందుకు చేయలేదు” ప్రశ్నించింది శ్రీమతి.
”ఇప్పుడు చేశాము కదా!” అన్నాడు.
”ఇప్పుడు చట్టం చేసి పదిహేనేళ్ళ తర్వాత అమలు చేస్తారా? ఏ ప్రభుత్వ మైనా ఇలాంటి చట్టం చేసిందా? అడిగింది శ్రీమతి.
”దానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి! అవన్ని పరిష్కరించాలి. నియోజకవర్గాల విభ జన చేయాలి. మహిళా నియోజక వర్గాలు గుర్తించాలి. ఇలాంటివి పూర్తి చేయాలంటే సమయం కావాలి!” అన్నాడు గంభీరంగా.
”ఓహౌ! మీకు నచ్చినవైతే గంటల్లో చట్టాలు చేసి రోజుల్లో అమలులోకి వచ్చేలా చట్టాలు చేస్తారు! కాని మహిళా రిజర్వేషన్లు మాత్రం దశాబ్దాల తర్వాతే అమలులోకి వచ్చేలా చేస్తారు! అంతే కదా!” అన్నది శ్రీమతి.
”అంత హడావుడిగా ఏ చట్టము చేయలేదు” అన్నాడు బింకంగా.
”370 ఆర్టికల్‌ రద్దు, మోటారు వాహనాల చట్ట సవరణ, నూతన విద్యాచట్టం, కార్మిక చట్టాల సవరణ, అటవీ భూముల చట్టం, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ కోసం చట్టాలు ఇలా ఎన్నో చేశారు. అవన్నీ తక్షణమే అమలులోకి వచ్చేలా చేశారు కదా”! అన్నది శ్రీమతి.
”అంటే నీవు చట్టాన్ని వ్యతిరేకిస్తున్నావా? మహిళవై ఉండి, మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నావా?” అన్నాడు.
”మీకంతే అర్థం అవుతుంది! ఈ చట్టంలో ఉన్న లోపాల గురించి చెబుతున్నాను!” అన్నది శ్రీమతి.
”చట్టంలో లోపాలా? చేసింది ఎవరనుకున్నావు” అన్నాడు.
”ఎవరు చేశారో తెలుసు గనకే ఈ సమస్యలు వస్తున్నాయి. నస్త్రీ స్వాతంత్య్రమర్హతి అన్నవారే చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల గురించి చట్టం చేస్తే ఎలా నమ్మాలి? కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి అత్యున్నత స్థాయి అధికారం గల మహిళను పిలవకపోతే ఎలా నమ్మాలి?” ప్రశ్నించింది శ్రీమతి.
”మహిళల పట్ల మా చిత్తశుద్ద్ధిని నమ్మాలి!” అన్నాడు.
”మనుస్మృతిని రద్దు చేసినమని ప్రకటించి, ఆ తర్వాత ఈ చట్టం చేసి ఉంటే మీ చిత్తశుద్ధిని నమ్మేవాళ్ళం! పార్లమెంటులో అన్ని పార్టీల వారు కోరి నట్లు ఓబీసీ రిజర్వేషన్లు ఈ చట్టంలో పొందుపర్చి ఉంటే, మీ చిత్తశుద్ధిని నమ్మేవాళ్లం. దేశంలో మీరు అధికారంలో ఉన్న రాష్రాల్లో మహిళలను గౌర వించి ఉంటే, మత కల్లోహాలు జరుగుతున్నపుడు మహిళల గర్భాలు చీల్చ కుండా ఉంటే మీ చిత్తశుద్ధి నమ్మేవాళ్ళం. గత పదేళ్ళుగా పసిపిల్లలపై గుళ్ళలోనే అత్యాచారాలు జరుగుతుంటే నీరెత్తని మీరు చిత్తశుద్ధి గురించి మాట్లాడుతారా? అన్నది శ్రీమతి.
”అంటే చట్టాన్ని గుర్తించరా?” అడిగారు.
”గుర్తించాం! ఆ చట్టం ఎండమావి!”
– ఉషాకిరణ్‌

Spread the love