నవతెలంగాణ- మద్నూర్
హైదరాబాదులో సోమవారం నిర్వహించిన రెవెన్యూ, గృహ నిర్మాణాల, శాఖ సమీక్ష సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలో పోడు భూముల సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా అమలు కావాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
అలాగే కొన్ని ప్రాంతాల్లో ఫారెస్ట్ భూముల సమస్యల వల్ల రైతులు, గిరిజనులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించి, భూముల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై నిజామాబాద్ జిల్లా ఇంచార్జి, రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క, అలాగే తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.



