ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

నవతెలంగాణ – హనుమకొండ
సుదీర్ఘకాలం పాటు పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం హనుమకొండ జిల్లా సుబేదారిలోని ప్రభుత్వలా కళాశాలలో హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు అధ్యక్షతన ఉపాధ్యాయులు, అధ్యాపకులతో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై ఉన్న స్టే తొలగించడానికి ఎర్లీ హియరింగ్‌ పిటీషన్‌ వేసి, ఈ వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని తెలిపారు. వేతనాలు ప్రతి నెల ఒకటవ తారీఖున చెల్లించాలని, ఉపాధ్యాయుల పీఎఫ్‌, టీఎస్జీఎల్‌ఐ, తదితర పెండింగ్‌ బిల్లులను అదే టోకెన్‌ నెంబర్‌పై ఏప్రిల్‌ చివర్లో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ వర్తింపజేస్తూ తక్షణం ఉత్తర్వులు విడుదల చేయాలని, పండిట్‌, పీఈటీ అప్‌గ్రేడ్‌ పోస్టులకు పదోన్నతులు ఇవ్వాలని, డీఈఓ చేతిలో ఉన్న 7,000 ఉపాధ్యాయ ఖాళీలను ఐఎఫ్‌ఎస్‌ఎంఐఎస్‌ వెబ్‌సైట్‌లో చూపాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీ అధ్యాపకుల వేతనాలు 30శాతం పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వాలని, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులను రెగ్యులర్‌ కోర్సులుగా మార్పు చేసి అధ్యాపక పోస్టులను మంజూరు చేయాలని కోరారు. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని, ఎయిడెడ్‌, రెసిడెన్షియల్‌, కేజీబీవీ, డిగ్రీ కళాశాలలో కేర్‌ టేకర్లను నియమించి మహిళా ఉపాధ్యాయులు, అధ్యాపకులకు రాత్రివేళ డ్యూటీ నుంచి మినహాయించాలన్నారు. కేజీబీవీ సిబ్బందికి మినిమం బేసిక్‌ పే ఇవ్వాలని, మోడల్‌ స్కూల్‌ టీచర్లకు బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని తెలిపారు. పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలన్నారు. ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు నాలుగు నెలల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కే. సోమశేఖర్‌, ఆల్‌ యూనివర్సిటీ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ కుమార్‌ లోది, కాంట్రాక్టు లెక్చరర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పస్కుల శ్రీనివాస్‌, టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు నన్నేపోయిన తిరుపతి, రావుల రమేష్‌, డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌ రెడ్డి, టీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆసనాల శ్రీనివాస్‌, టీఎస్‌ యూటీఎఫ్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎం. సదాశివరెడ్డి, వరంగల్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తాటికాయల కుమార్‌, బద్దం వెంకటరెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, మండల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు..

Spread the love