నేడు మోడీ ప్రమాణ స్వీకారం

Modi swearing in today– కొలువుదీరనున్న కొత్త సర్కార్‌
– దేశ రాజధానిలో భద్రత కట్టుదిట్టం
– 8 వేల మంది అతిథులు హాజరు
నవతెలంగాణ-న్యూడిల్లీ బ్యూరో
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం నాడిక్కడ రాష్ట్రపతి భవన్‌లో వరుసగా మూడోసారి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ సందర్భంగా దేశ రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటు నేతల కోసం ప్రత్యేక చర్యలు కూడా తీసుకోనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ రంగాల నిపుణులు, సాంస్కృతిక ప్రదర్శనకారులతో సహా 8,000 మంది అతిథులు హాజరుకానున్నారు.ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రి మండలి సభ్యులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్‌లో ఐదు కంపెనీల పారామిలటరీ సిబ్బంది, ఎన్‌ఎస్జీ కమాండోలు, డ్రోన్లు, స్నిపర్లతో సహా బహుళ స్థాయి భద్రతతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వేడుకలో నేరపూరిత, తీవ్రవాద కార్యకలాపాల బెదిరింపులను నివారించడానికి వివిధ వైమానిక ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ, ఢిల్లీ మీదుగా నో-ఫ్లై జోన్‌ను పబ్లిక్‌ అడ్వైజరీ ప్రకటించింది. ఈ పరిమితి జూన్‌ 9 నుండి జూన్‌ 10 వరకు అమలులో ఉంటుంది. ఉల్లంఘించినవారు ఐపీసీసీ సెక్షన్‌ 188 ప్రకారం జరిమానాలను ఎదుర్కొంటారు.విదేశీ ప్రముఖుల కోసం ప్రత్యేక ప్రోటోకాల్‌తో సహా మెరుగైన భద్రతా చర్యలు అమలులో ఉన్నాయి. ఈ భద్రతా చర్యలలో ప్రముఖులు వారి హౌటళ్ల నుంచి వేదిక వరకు నిర్దేశించబడిన మార్గాలు ఉన్నాయి. లీలా, తాజ్‌, ఐటిసి మౌర్య, క్లారిడ్జ్‌లు, ఒబెరారు వంటి ప్రముఖ హౌటల్‌లు ప్రత్యేక భద్రతా మయంలో ఉన్నాయి. దీంతో ఇక్కడ సరిహద్దు తనిఖీలను పెంచడంతో రోడ్ల మూసివేత, ట్రాఫిక్‌ మళ్లింపులు చేశారు.ఆదివారం జరగనున్న మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వచ్చిన ఆహ్వానాన్ని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజు అంగీకరించారు. మాల్దీవులతో పాటు, ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్‌, శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, మారిషస్‌, సీషెల్స్‌ నుండి ఇండియా ‘నైబర్‌హుడ్‌ ఫస్ట్‌’ విధానంలో భాగంగా నాయకులు హాజరు కానున్నారు.ఎన్డీఏ నేతగా ఎన్నికైన నరేంద్ర మోడీ క్యాబినెట్‌లో బీజేపీ ఎంపీలతో పాటు , దాదాపు మూడోవంతు మంది నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్‌డిఎ) మిత్రపక్షాల ఎంపీలు కూడా ఉంటారు. మిత్రపక్షాలకు ఎంపిక చేసిన ఫార్ములా ప్రకారం ప్రతి నలుగురు, ఐదుగురు ఎంపీలకు ఒక క్యాబినెట్‌ మంత్రి పదవిని, ప్రతి ఇద్దరికీ ఒక సహాయ మంత్రి పదవులు ఇస్తారని తెలుస్తోంది. ఆ మేరకు బీజేపీ నేతలు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, జేపీ నడ్డా మిత్రపక్షాలతో చర్చలు జరుపుతున్నారు.

Spread the love