మోగిన ఎన్నికల నగారా

– నవంబర్ 3 న ఎన్నికల నోటిఫికేషన్,
– నవంబర్ 30 న ఎన్నికలు,
–  డిసెంబర్ 3 న ఫలితాలు,
– మొదలైన బ్యాలెట్ పోరు.
నవతెలంగాణ-సూర్యాపేట : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ ప్రకటించింది. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కూడా సీఈసీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం నాడు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు .రాష్ట్రంలో జరిగే ఎన్నికల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నవంబర్ 3 న తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది.అదే నెలలో 10 వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.13 న నామినేషన్ల స్క్రూట్ని నిర్వహిస్తారు. అనంతరం 15 వ తేదీన నామినేషన్ల ఉపసంహరణలు ఉంటాయి. నవంబర్ 30 న ఎన్నికలు జరుగుతాయి.డిసెంబర్ 3 న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాజివ్ కుమార్ తెలిపారు. ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తామని అన్నారు. వీవీ ప్యాట్ లు, ఈవీఎంలు సిద్దం చేశామన్నారు.ఇప్పటివరకు ఎన్నికల నిర్వహణపై ఉన్న సస్పెన్స్ నేటి ప్రకటనతో తెరపడింది. దీంతో రాష్ట్రంలో, జిల్లాలలో పార్టీల మధ్య బ్యాలెట్ పోరు ప్రారంభం కానున్నది.ఈ నేపథ్యంలో స్థానిక కలెక్టరేట్ లో కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఇతర అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల విది ,విధానాలు,కోడ్ తదితర వివరాలను తెలిపారు.జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ,హుజుర్ నగర్ నియోజకవర్గాల్లో మొత్తంగా కలుపుకొని 963777 ఓటర్లు వున్నారు. ఇందులో పురుషులు 475375 మంది ఓటర్లు ఉండగా మహిళలు 488345 ఓటర్లు వున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేటలో మొత్తం 235221 ఓటర్లు ఉండగా పురుషులు 115628,మహిళలు 119576 మంది ఓటర్లు వున్నారు. అదేవిధంగా హుజుర్ నగర్ లో మొత్తం 242711 ఉండగా పురుషులు 118664 మహిళలు 124030 వున్నారు. ఇక కోదాడ లో 237289 ఓటర్లు ఉండగా పురుషులు 116257 మహిళలు 121017 మంది తుంగతుర్తి లో 248556 మంది ఓటర్లు ఉండగా పురుషులు 124826 మహిళలు 123722 మంది ఓటర్లు వున్నారు. ఈ నియోజకవర్గ స్థాయిలో అత్యధికంగా తుంగతుర్తి లో 248556 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా సూర్యాపేటలో 235221 ఓటర్లు వున్నారు. ఇందుకు గాను జిల్లాలో 1201 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2435 బ్యాలెట్ యూనిట్లు,కంట్రోల్ యూనిట్లు 1911,1863 వీవీప్యాట్‌లను సిద్ధం చేశారు. ఎలక్ట్రానిక్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని ఈ ఎన్నికల్లో అమలులోకి తీసుకొస్తామని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో నవంబర్ 30  న ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా డిశంబర్ 3 న  ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల తో జిల్లాలో వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది.అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని వివిధ రాజకీయ పార్టీలు తూచా తప్పకుండా పాటించాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి ఎన్నికల సిబ్బంది పనిచేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో వివిధ నిబంధనలను అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు పాటించాల్సి ఉంటుంది.జిల్లాలో గత కొన్ని రోజుల నుండి రాజకీయ పక్షాలు పరస్పర విమర్శలతో దుమ్మెత్తి పోసుకున్నాయి. పలుచన చేసే ప్రసారాలు హోరెత్తిoచాయి. సోషల్ మాధ్యమాన్ని హల్ చల్ చేసిన విషయం తెల్సిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ  జిల్లా రాజకీయ సమీకరణాలు తుది రూపు దిద్దుకొనున్నాయి.కాగా బి.ఆర్.యస్ పార్టీ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సిట్టింగ్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెల్సిందే. మంత్రి జగదీష్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, సైదిరెడ్డి లు వివిధ అభివృద్ధి పనులు, పథకాల పేరుతో నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే విళ్లు ప్రజలతో ప్రతి రోజు “టచ్” లో ఉంటూ పర్యటనలు చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.దీంతో జిల్లాలో కార్యకర్తలు, నాయకుల మధ్య ఉత్కంఠ నెలకొంది. కాగా బీఎస్పీ నుండి మాత్రం డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ ను అభ్యర్థి గా ఆ పార్టీ అధ్యక్షుడు ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించిన విషయం తెల్సిందే.ఇక్కడ జానయ్య అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆయన భార్య 13వ వార్డ్ కౌన్సిలర్ రేణుక నియోజకవర్గంలో పర్యటిస్తూ తన భర్తను గెలిపించాలని ప్రచారం చేస్తుంది. ఇక బిజెపి మాత్రం ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదు.కాంగ్రెస్, బీజేపీ పార్టీల అభ్యర్థుల ప్రకటన విడుదల కాకపోవడంతో కొంత జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో  గడువు 50 రోజులు ఉండటంతో ప్రధాన పార్టీలు ప్రచారానికి,ర్యాలీలు, బహిరంగ సభలు,రోడ్ షో లకు సమాయత్త మవుతున్నాయి. నగరా మోగడంతో జిల్లాలో ఎన్నికల వేడి మరింత గా రాజుకోనున్నది.
Spread the love