మున్సిపాలిటీలో మనీ మాయాజాలం

– రసీదులు రద్దు…ఫోన్‌ పే ముద్దు
– ఇంటినెంబర్‌ మార్చాలా..మా జేబులు తడపాల
నవతెలంగాణ-మణుగూరు
ఖాళీ స్థలాన్నికి ఇంటి నెంబర్‌ కావాలంటే ఫోన్‌ పేలో డబ్బులు వేయండి ఇంటి నెంబర్‌ పొందండి కొత్త ఇంటి నిర్మాణం చేసే పేదవారికి మాత్రమే డెబ్రీస్‌ ఫీజు, రాజకీయ నాయకులకూ, ఐటీఐ కాలేజీ యజమానులకు నో ఫీజు, సస్పెండ్‌ అయినా, ప్రమోషన్‌ పై బదిలీ అయినా తిరిగి మణుగూరు మున్సిపాలిటీని వదిలేదేలేదు. మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ తతంగంపై కలెక్టర్‌ విచారణ చేపట్టాలని ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నారు. చేతికి డబ్బులోద్దు ఫోన్‌ పే ముద్దు అనే కొత్త నినాదంతో మణుగూరు మున్సిపాలిటీలోని కొంతమంది వ్యక్తులు, సామాన్య ప్రజలనుండి ఫోన్‌ పే ద్వారా లంచాన్ని దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో కొందరు అధికారులు చేసే ఆగడాలకు హద్దు, అదుపు లేకుండా పోతుందని, అంతా మనీ మాయాజాలంగా నడుస్తుందని మణుగూరు మున్సిపాలిటీ ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారుల జేబులు తడపనిదే ఇంటి నెంబర్లు మార్చడం లేదని, లంచం ఇస్తే చిటికెలో మారుస్తున్నారని, మున్సిపాలిటీ మొత్తం అవినీతి కంపులో కూరుకుపోయిందని అన్నారు. అనుకున్న మొత్తం ముట్ట చెబితే, నిబంధనలను తుంగలో తొక్కి ఇంటి నెంబర్ను ఒకరి పేరు నుండి మరొకరి పేరుకు తక్షణమే మార్పిడి చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రసీదుల ద్వారా కాకుండా ఫోన్‌ పే ద్వారా డబ్బులు తీసుకుంటూ, వారి సొంత అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని మరో సామాజిక కార్యకర్త అన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ తతాంగంపై కలెక్టర్‌ విచారణ జరిపి, అవినీతి అవకతవకలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నారు.
అక్రమ వసూళ్లపై విచారణ చేపట్టాలి
మణుగూరు మున్సిపాలిటీలో ఇంటి పన్ను పేరుతో అవినీతి జరుగుతుంది. అమాయక ప్రజల బలహీనతలను ఆసరా చేసుకొని అవినీతికి పాల్పడుతున్నారు. కొత్త ఇల్లు నిర్మించుకున్న వారికి కరెంట్‌ మీటర్‌, ఇంటి పన్ను కోసం దరఖాస్తు చేసుకున్న వారి దగ్గర నుండి అనేక కారణాలు చూపుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంటి పన్ను వసూళ్లలో కూడా శాస్త్రవేత్త లేకుండా అడ్డంగా వసూలు చేస్తున్నారు.
– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొడిశాల రాములు

Spread the love