వర్సిటీ వీసీల ఎంపికపై నిఘా

Monitoring selection of varsity VCs– జెంటిల్‌మెన్‌ కోసం జల్లెడ
– షార్ట్‌ లిస్ట్‌లోని ఒక్కొక్కరి గురించి ప్రభుత్వ వర్గాల ఆరా
– జూన్‌ 10లోపు నియామకాలకు కసరత్తు..!
నవతెలంగాణ-ఓయూ
యూనివర్సిటీల వీసీ ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ప్రొఫెసర్లలో జెంటిల్‌మెన్స్‌ కోసం జల్లెడ పడుతోంది. గత ప్రభుత్వం వీసీల నియామకాల్లో చేసిన లోపాలను గుర్తించి.. అలాంటి వారిని వీసీలుగా నియమించకుండా పారదర్శకంగా, నిజాయితీగా ఎంపిక చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది.
రాష్ట్ర వ్యాప్తంగా 318 మంది వివిధ యూనివర్సిటీల వీసీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో నుంచి సుమారు 55 నుంచి 80 మందితో షార్ట్‌ లిస్టు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఆ షార్ట్‌ లిస్టులో ఉన్న వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. 2 నుంచి 4 విభాగాలకు చెందిన నిఘా వర్గాలు.. షార్ట్‌ లిస్టులో ఉన్న ప్రొఫెసర్లలో ఒక్కొక్కరి వివరాలు, వారి గుణగణాలు సేకరిస్తున్నట్టు తెలిసింది.
ఇలా వివరాలు సేకరణ..
వీసీల కోసం సుమారు 15 నుంచి 18 అంశాలను ఒక టేబుల్‌గా తయారు చేసుకొని.. ఒక్కో ఆశావహుని డేటాను సేకరిస్తున్నారు. వారు విద్యార్థి దశలో ఎలా ఉన్నారు? వృత్తి పరంగా, గతంలో ఎలాంటి పదవులు నిర్వహించారు? అప్పుడు సమస్యలు ఎలా పరిష్కరించారు..? ఇలాంటి వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. అలాగే విద్యార్థులు ఉద్యోగులతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారు. పాలన అనుభవం, సమయ స్ఫూర్తి, ఏవైనా ఆరోపణలు ఎదుర్కొంటున్నారా? గత పదవుల్లో ఏమైనా అవినీతికి పాల్పడ్డారా, ఆరోగ్య పరిస్థితి, సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌, యూనివర్సిటీల యాక్ట్‌ నిబంధనలపై అవగాహన కలిగి ఉన్నారా? పరిపాలన, పరిశోధన అనుభవం ఎంత వరకు ఉంది.. వారి విద్యార్హతల సర్టిఫికెట్లు, పరిశోధన పేపర్లు ఇలాంటి వాటిపై పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఆశావహుల ఇంటికి కూడా వెళ్లి నేరుగా వారినే పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకొందరికి ఫోన్‌ చేసి గోప్యంగా నిఘా వర్గాలు వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ఒకే వ్యక్తి గురించి వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. అయితే కచ్చితత్వం గల వ్యక్తులను వీసీలుగా తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఎంత వరకు ఫలిస్తుందో? ఎలాంటి వీసీలు వస్తారో వేచి చూడాల్సిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూపై సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు తెలిసింది. జిలాల్లో ఉన్న యూనివర్సిటీలకు వీసీల నియామకాల్లో జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. యూనివర్సిటీల్లో రాజకీయ ప్రాతినిధ్యం లేని.. నిత్యం పాఠాలు చెప్పి, విద్యార్థులను, ఉద్యోగులను, ప్రొఫెసర్లను కలుపుకొని పోతూ.. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూసే వారు, వివిధ సంస్థల నుంచి నిధులు తెచ్చుకునే సామర్థ్యం ఉన్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం జల్లెడ పడుతున్నది. వీసీలను ఈ ఏడాది జూన్‌ 5 నుంచి 10లోపు నియమించడానికి వీలుగా ఈ కసరత్తు ప్రారంభించింది.
వర్సిటీలకు పూర్తిస్థాయిలో పాలకమండలి(ఈసీ) కరువు
రాష్ట్రంలో యూనివర్సిటీలకు పాలకమండలి (ఈసీ) గడువు ఫిబ్రవరి 28తో ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ, ఫైనాన్స్‌ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ, కమిషన్‌ కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీ ఇలా ముగ్గురు ఎక్స్‌ అఫిషియో సభ్యులతో నడుస్తోంది. దాంతో పూర్తిస్థాయి పాలక మండలిని ఏర్పాటు చేయాలని పలువురు అధ్యాపకులు, విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వీసీలు ఉంటే పాలక మండలి లేదు.. పాలక మండలి ఉంటే వీసీలు లేరు.. కాబట్టి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజకీయ వాసనలు లేని మేధావులు, విద్యావేత్తలను పాలక మండలి సభ్యులుగా నియమించి మండలి ఔన్నత్యాన్ని పెంపొందించాలని యూనివర్సిటీ వర్గాలు కోరుకుంటున్నాయి.

Spread the love