Tuesday, May 12, 2026
E-PAPER
Homeమానవిపచ్చి మామిడితో నోరూరించేలా…

పచ్చి మామిడితో నోరూరించేలా…

- Advertisement -


వేసవిలో నోరూరించే పండ్లలో మామిడి ముందుంటుంది. పచ్చి కాయలతో పచ్చడి పెట్టుకుంటే.. పండ్లను నేరుగా ఆరగిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక మరికొందరు పచ్చి మామిడితో పులిహోర వంటివి చేసుకుంటారు. అయితే ఇవే కాకుండా పచ్చిమామిడితో ఇంకా రకరకాల వంటకాలు చేసుకోవచ్చు.


మామిడి మటన్​ కర్రీ కావాల్సిన పదార్థాలు
మసాలా పేస్ట్​ కోసం: ధనియాలు – రెండు టేబుల్​స్పూన్లు, జీలకర్ర – టీస్పూన్​, మిరియాలు – టీస్పూన్​, జీడిపప్పు పలుకులు – పది, గసగసాలు – అర టేబుల్​స్పూన్
​కర్రీ కోసం: నూనె – పావు కప్పు, దాల్చినచెక్క – చిన్న ముక్క, లవంగాలు – రెండు, యాలకులు – రెండు, ఉల్లిగడ్డ – రెండు, కరివేపాకు – రెండు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్​ – రెండు టేబుల్​స్పూన్లు, మటన్​ – అరకిలో, జీడిపప్పు పలుకులు – పావు కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, కారం – మూడు టేబుల్​స్పూన్లు(తగినంత), పసుపు – అర టీస్పూన్​, పచ్చిమిర్చి – రెండు, వేడి నీరు – రెండు కప్పులు, మామిడికాయ ముక్కలు – అర కప్పు, కసూరీ మేథీ – చిటికెడు, కొత్తిమీర తరుగు – కొద్దిగా, గరం మసాలా – అర టీస్పూన్​.

తయారీ విధానం: ఉల్లిగడ్డ సన్నగా, పొడుగ్గా కట్​ చేసుకోవాలి. మామిడికాయపై పొట్టు తీసేసి సన్నని ముక్కలుగా కట్​ చేసి అర కప్పు కొలత ప్రకారం తీసుకుని పక్కన ఉంచాలి. కుక్కర్​ గిన్నెలో నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేసి ఓ నిమిషం వేయించాలి. మసాలా దినుసులు వేగినాక ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు వేసి గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయేవరకు కలుపుతూ వేయించాలి. అనంతరం శుభ్రం చేసుకున్న మటన్​ వేసి హై ఫ్లేమ్​లో కలుపుతూ ఓ ఐదు నిమిషాల పాటు మగ్గించాలి. తర్వాత జీడిపప్పు పలుకులు వేసి మరికాసేపు వేయించాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి చీలికలు వేసి కాసేపు మగ్గించాలి. అనంతరం రెండు కప్పుల వేడి నీరు పోసి బాగా కలిపి మూత పెట్టి విజిల్​ ఉంచి మీడియం ఫ్లేమ్​లో ఐదు విజిల్స్​ వచ్చే వరకు కుక్​ చేసుకోవాలి. ఈలోపు కడాయిలో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు పలుకుల వేసి దోరగా వేయించాలి. అందులోనే గసగసాలు కూడా వేసి స్టవ్​ ఆఫ్​ చేయాలి.

ఇవి పూర్తిగా చల్లారినాక కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ వీలైనంత మెత్తని పేస్ట్​లా చేసుకోవాలి. కుక్కర్​ ఆవిరి పోయినాక మూత తీసి మటన్​ ఉడికిందో లేదో చెక్​ చేసుకోవాలి. ఒకవేళ సరిగ్గా ఉడకకపోతే మరోసారి మూత పెట్టి ఇంకొన్ని విజిల్స్​ వచ్చే వరకు కుక్​ చేసుకోవాలి. మటన్​ పర్ఫెక్ట్​గా ఉడికిన తర్వాత మరోసారి స్టవ్ ఆన్​ చేసి హై ఫ్లేమ్​లో కలుపుతూ ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత గ్రైండ్​ చేసిన మసాలా పేస్ట్​, మరో కప్పు నీళ్లు పోసి కలుపుతూ ఉడికించాలి. గ్రేవీ దగ్గరపడి నూనె పైకి తేలినాక కట్​ చేసిన మామిడికాయ ముక్కలు, మరో కప్పు వేడి నీరు పోసి మీడియం ఫ్లేమ్​లో పది నిమిషాల పాటు కుక్​ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర తరుగు, కసూరీ మేథీ వేసి మరో ఐదు నిమిషాలు కుక్​ చేసి స్టవ్​ ఆఫ్​ చేసి వేడివేడిగా సర్వ్​ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ మటన్​ కర్రీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

కొబ్బరి అన్నం
కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం – రెండు కప్పులు (పొడిపొడిగా ఉండాలి), పచ్చి మామిడి తురుము – అర కప్పు, పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు, పచ్చిమిర్చి – నాలుగు (చీలికలు), పల్లీలు – రెండు టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి – రెండు, కరివేపాకు – రెండు రెమ్మలు, పసుపు – అర టీస్పూన్, ఇంగువ – చిటికెడు, నూనె – మూడు టేబుల్ స్పూన్లు, ఆవాలు – టేబుల్ స్పూన్, జీలకర్ర – టేబుల్ స్పూన్, మినపప్పు – టేబుల్ స్పూన్, శనగపప్పు – టేబుల్ స్పూన్, కొత్తిమీర – తగినంత, ఉప్పు – రుచికి సరిపడా .

తయారీ విధానం : పొడిపొడిగా అన్నం వండుకున్న తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్‌లో వేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత బాణాలిలో నూనె వేసి వేడి చేయాలి. హీట్ అయిన తర్వాత పల్లీలు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి చిటపటలాడే వరకు వేయించాలి. తాలింపు వేగిన తర్వాత పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అనంతరం పచ్చి మామిడికాయ తురుము వేసి కనీసం ఒక నిమిషం పాటు వేయించాలి. వెంటనే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి అంతా ఒకసారి కలిపి స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని చల్లారిన అన్నంలో వేసి, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా లాగిస్తారు.

మామిడి గుజ్జు పచ్చడి
కావాల్సిన పదార్థాలు:మామిడికాయ – ఒకటి, టమాటాలు – రెండు, ఎండుమిర్చి – ఎనిమిది, పచ్చిమిర్చి – నాలుగు, కరివేపాకు – రెండు రెమ్మలు, ఉల్లిగడ్డ – మూడు, వెల్లుల్లి రెబ్బలు – పది, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు – గుప్పెడు.

తయారీ విధానం: మామిడికాయపై పొట్టు తీసేసి కాస్త పెద్ద ముక్కలుగా కట్​ చేసుకోవాలి. అదే విధంగా టమాటాలను సగానికి కట్​ చేసుకోవాలి. రెండు ఉల్లిగడ్డను పొడుగ్గా, సన్నగా, ఇంకో ఉల్లిగడ్డ సన్నగా తరిగి పక్కన పెట్టాలి. వెడల్పాటి పాన్​ పెట్టి ఒక టీస్పూన్​ నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి లో ఫ్లేమ్​లో వేయించాలి. ఇవి వేగినాక ప్లేట్​లోకి తీసుకోవాలి. అదే పాన్​లోకి ఇంకొంచెం నూనె వేసి సన్నగా కట్​ చేసుకున్న ఉల్లిగడ్డలు, వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుతూ ఫ్రై చేయాలి. అవి గోల్డెన్​ కలర్​లోకి మారినాక ప్లేట్​లోకి వేసుకోవాలి. అదే పాన్​లో మరికాస్త ఆయిల్​ వేసి మామిడి ముక్కలు, టమాటాలు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో మగ్గించాలి. మెత్తగా ఉడికినాక స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీజార్​లోకి వేయించిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్​ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో వేయించిన ఉల్లిగడ్డలు వేసి మెదుపుకోవాలి. తర్వాత వేయించిన మామిడి ముక్కలు, టమాటాలు వేసి మరోసారి మెదుపుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మామిడి గుజ్జు పచ్చడి రెడీ.

పప్పుచారు
కావాల్సిన పదార్థాలు: కందిపప్పు – రెండు గ్లాసులు, ఉల్లిగడ్డ – రెండు(మీడియం సైజ్​వి), టమాటాలు – నాలుగు, పచ్చిమిర్చి – నాలుగైదు, పసుపు – కొద్దిగా
పప్పుచారు కోసం : పచ్చిమామిడికాయలు – ఒకట్రెండు, నెయ్యి – రెండు టీస్పూన్లు, నూనె – ఏడెనిమిది టేబుల్​స్పూన్లు, మెంతులు – కొన్ని, ఆవాలు – చెంచా, జీలకర్ర – రెండున్నర టీస్పూన్లు, ఎండుమిర్చి – నాలుగు, ఉల్లిగడ్డ – రెండు, పసుపు – కొద్దిగా, కారం – రుచికి తగినంత, ఇంగువ – చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు – 15 నుంచి 20, కొత్తిమీర తరుగు – కొద్దిగా.

తయారీ విధానం
: కందిపప్పు గంట పాటు నానబెట్టుకోవాలి. ఉల్లిగడ్డ, టమాటాలు, మామిడి కాయలను పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. నానబెట్టుకున్న పప్పును కుక్కర్​ గిన్నెలోకి తీసుకొని ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు వేసుకొని పప్పు తీసుకున్న గ్లాసుతో మూడు గ్లాసుల నీళ్లు పోసుకుని నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత గిన్నెలో నెయ్యి లేదా నూనె వేసి వేడిచేయాలి. తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తుంపలు వేసుకుని వేయించుకోవాలి. అన్నీ చక్కగా వేగాక ఉల్లిగడ్డ చీలికలు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాస్త పసుపు, టేస్ట్​కు సరిపడా కారం, ఇంగువ, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలపాలి. తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుని మళ్లీ కలుపుకోవాలి. మూతపెట్టి లో ఫ్లేమ్​లో మామిడి ముక్కలు కాస్త మెత్తబడే వరకు మగ్గించుకోవాలి.

ఈలోపు ఉడికించుకున్న పప్పును పప్పుగుత్తితో మెదుపుకోవాలి. ఆపై అందులో మీకు పప్పుచారు కావాల్సిన దాన్ని బట్టి తగినన్ని నీళ్లు పోసి కలిపి పక్కనుంచాలి. మామిడికాయ ముక్కలు లైట్​గా మగ్గినాక అందులో పప్పుచారు మిశ్రమం పోసి బాగా కలపాలి. తర్వాత స్టవ్​ మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మిక్సీ గిన్నెలో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని మరుగుతున్న పప్పుచారులో వేసి మరోసారి చక్కగా కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరగా సన్నని కొత్తిమీర తరుగు వేసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. నోరూరించే “మామడికాయ పప్పుచారు” రెడీ అవుతుంది! ఇంటిల్లిపాది ఎంతో ఇష్టంగా తినొచ్చు. అవేంటో తెలుసుకుందాం…

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -