నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ‘ ఐ ఫౌండేషన్’ ఛైర్మన్ సుత్తరాపు రవీందర్ ఆధ్వర్యంలో ‘ప్రతిభా పురస్కారాలు – 2026’ కార్యక్రమం రవీంద్రభారతిలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు తమ అద్భుతమైన ప్రతిభతో అత్యుత్తమ ఫలితాలు సాధించడం ఎంతో గర్వకారణమని కొనియాడారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత కష్టపడి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మరియు వారి విజయానికి దిశానిర్దేశం చేసిన ప్రధానోపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేసి పురస్కారాలను అందజేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం, తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ వర్రా వెంకటేశ్వర్లు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు అందిస్తున్న కృషిని వారు అభినందించారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు ఇలాంటి ప్రోత్సాహకరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఐ ఫౌండేషన్ సేవలను వారు ప్రత్యేకంగా ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో సుత్తరాపు అనిల్, రమేష్,శివచరణ్ నాయుడు, అవార్డు గ్రహీతలైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఐ ఫౌండేషన్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



