టీఆర్టీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలి : ఎంపీ కోమటిరెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని కోమటిరెడ్డి నివాసంలో టీఆర్టీ అభ్యర్థులు ఆయన్ను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ టీర్టీ నోటిఫికేషన్‌ సాధన కోసం కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందని తెలిపారు. పార్టీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో వేలాది టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం స్కీమ్‌ల పేరుతో మోసాలు చేస్తున్న కేసీఆర్‌కు నిరుద్యోగుల బాధలు పట్టవా? అని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం దిగిరాకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడించాలని పిలుపునిచ్చారు.
కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్‌లో విక్రమార్క
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు కార్మికుల అవసరాలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ ఆవరణలోని ప్రకాశ్‌హాల్‌లో అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్‌ (కేకేసీ) కో ఆర్డినేటర్‌ సమీర్‌ కౌశల్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో కనీసవేతనాలపై సమీక్షించలేదని విమర్శించారు. 2023- 24లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలు తీసుకొస్తామన్నారు. సమావేశంలో ఏఐసీసీ అసంఘటిత కార్మిక విభాగం కాంగ్రెస్‌ చైర్మెన్‌ ఉదిత్‌రాజ్‌, ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్‌ అలీఖాన్‌, నాయకులు మధు యాష్కీ, మహేష్‌ కుమార్‌ గౌడ్‌, కుసుమ కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. వినోద్‌రెడ్డి, సంగిశెట్టి జగదీష్‌, అంజన్‌ కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love