బ్రెయిన్‌ స్ట్రోక్‌తో.. ములుగు జెడ్పీ చైర్మెన్‌ కుసుమ జగదీష్‌ మృతి

– సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌, మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి
– నేడు అంతిమయాత్రలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ- ములుగు
ములుగు జిల్లా పరిషత్‌ చైర్మెన్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్‌(47) ఆదివారం హఠాన్మరణం చెందారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు హన్మకొండలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే జగదీష్‌ మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. కాగా, జగదీష్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 1న సైతం గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆయన భార్య రమాదేవి సీపీఆర్‌ చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు అదే తరహాలో మరోసారి బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో జగదీష్‌ మృతి చెందారు. మృతుడు జగదీష్‌కు భార్య రమాదేవి, కుమారుడు వెంకట సత్యదేవ్‌, కూతురు హర చందన, తల్లిదండ్రులు ఉన్నారు. కాగా, నేడు ఉదయం 9 గంటలకు జరిగే ఆయన అంత్యక్రియల్లో మంత్రి కేటీఆర్‌ పాల్గొననున్నారు.
జగదీష్‌ కుటుంబానికి అండగా ఉంటాం: సీఎం కేసీఆర్‌
ములుగు జెడ్పీ చైర్మెన్‌, కుసుమ జగదీష్‌ అకాల మరణం పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో జగదీష్‌ పోషించిన చురుకైన పాత్రను, ములుగు జిల్లా పార్టీ అధ్యక్షు లుగా, జిల్లా పరిషత్‌ చైర్మెన్‌గా జగదీష్‌ చేసిన సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబాని కి అండగా ఉంటామని తెలిపారు.
హఠాన్మరణం బాధాకరం : మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి
బీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ కుసుమ జగదీష్‌ హఠాన్మరణం బాధాకరమని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఆదివారం ములుగులోని జగదీష్‌ స్వగహంలో జగదీష్‌ పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం మంత్రులు మాట్లాడారు. నిన్న మొన్నటి వరకు కలివిడిగా తిరిగిన జగదీష్‌ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ములుగు ప్రాంత అభివృద్ధికి కావాల్సిన నిధుల గురించే అడిగేవారని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందన్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. నివాళులర్పించిన వారిలో.. మాజీ ఎంపీ సీతారాం నాయక్‌, శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌, జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ గోవింద్‌ నాయక్‌, స్థానిక సర్పంచ్‌ చంద కుమారస్వామి, తదితరులున్నారు.

Spread the love