– ఛేదనలో కిషన్, సూర్య, పాండ్య జోరు
– బెంగళూర్‌పై ముంబయి ఘన విజయం
– బెంగళూర్ 196/8, ముంబయి 199/3
నవతెలంగాణ-ముంబయి
ముంబయి ఇండియన్స్ జోరందుకుంది. సొంతగడ్డపై వరుసగా రెండో విజయం సాధించింది. వాంఖడేలో 197 లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ఊదేసిన ముంబయి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఛేదనలో ఇషాన్ కిషన్ (69, 34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (52, 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలు బాదగా.. రోహిత్ శర్మ (38, 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హార్దిక్ పాండ్య (21 నాటౌట్, 6 బంతుల్లో 3 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడారు. తిలక్ వర్మ (16 నాటౌట్, 10 బంతుల్లో 3 ఫోర్లు) సైతం మెరవటంతో మరో 27 బంతులు ఉండగానే ముంబయి లాంఛనం ముగించింది. అంతకుముందు, జశ్‌ప్రీత్ బుమ్రా (5/21) ఐదు వికెట్లతో విజృంభించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (53 నాటౌట్, 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), రజత్ పాటిదార్ (50, 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), డుప్లెసిస్ (61, 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలు సాధించారు.
బుమ్రా ఐదేశాడు : బెంగళూర్ ఇన్నింగ్స్‌లో ఫామ్‌లో ఉన్న ఓపెనర్ విరాట్ కోహ్లి (3) సహా విల్ జాక్స్ (8) పవర్‌ప్లేలోనే డగౌట్‌కు చేరుకున్నారు. డుప్లెసిస్ (61), రజత్ పాటిదార్ (50) మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. అర్థ సెంచరీలతో మెరిసిన ఈ ఇద్దరూ బెంగళూర్‌ను భారీ స్కోరు దిశగా నడిపించారు. జశ్‌ప్రీత్ బుమ్రా పరుగుల పొదుపుతో పాటు రెండుసార్లు వరుస వికెట్ల ప్రతాపంతో బెంగళూర్‌ను దెబ్బకొట్టాడు. వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడిన బెంగళూర్ రన్‌రేట్ విషయంలో రాజీపడలేదు. గ్లెన్ మాక్స్వెల్ (0), మహిపాల్ లామ్రోర్ (0), విజరు కుమార్ (0)లు డకౌట్‌గా నిష్క్రమించారు. డెత్ ఓవర్లలో దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) దంచికొట్టాడు. 21 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన దినేశ్ కార్తీక్ ఇన్నింగ్స్ ఆఖరు ఓవర్లో 19 పరుగులు పిండుకున్నాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ 196 పరుగులు చేసింది. డుప్లెసిస్, రజత్ జోడీ 47 బంతుల్లో 82 పరుగులు జోడించగా.. కార్తీక్, డుప్లెసిస్‌లు 26 బంతుల్లో 45 పరుగులు జతచేశారు. ముగ్గురు బ్యాటర్లు అర్థ సెంచరీలు సాధించినా.. బుమ్రా బూమ్బూమ్తో బెంగళూర్ 200 లోపే స్కోరుకే పరిమితమైంది.