నల్లగొండ మున్సిపల్‌ చైర్మెన్‌ పీఠం కాంగ్రెస్‌ కైవసం

నల్లగొండ మున్సిపల్‌ చైర్మెన్‌ పీఠం కాంగ్రెస్‌ కైవసం– చైర్మెన్‌పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం
–  మున్సిపాల్టీలో కోమటిరెడ్డి మార్క్‌
నవతెలంగాణ- నల్లగొండటౌన్‌
నల్లగొండ మున్సిపల్‌ చైర్మెన్‌ మందడి సైదిరెడ్డిరెడ్డిపై కాంగ్రెస్‌ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉండగా, 47 మంది ఓటింగ్‌కు కార్యక్రమానికి హాజరయ్యారు. అనుకూలంగా 41 మంది, వ్యతిరేకంగా ఐదుగురు ఓటు వేశారు. అవిశ్వాసం నెగ్గడంతో చైర్మెన్‌ సైదిరెడ్డి పదవిని కోల్పోయారు. బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ బండారు ప్రసాద్‌ గైర్హాజరు కాగా, స్వతంత్ర కౌన్సిలర్‌ పిల్లి రామరాజు తటస్థంగా ఉన్నారు. దీంతో నల్లగొండ మున్సిపాలిటీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి మార్కు సాధించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ మందిరంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నల్లగొండ మున్సిపాల్టీలో మొత్తం 48 వార్డులు ఉన్నాయి. నాలుగు సంవత్సరాల కిందట జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 20 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ 20 మంది కౌన్సిలర్లు, బీజేపీ నుంచి ఆరుగురు, ఎంఐఎం నుంచి ఒకరు గెలుపొందారు. రెండు సంవత్సరాల కిందట అనారోగ్యంతో 26వ వార్డు కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ మృతిచెందారు. దీంతో ఆ వార్డు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించారు. మరో వార్డు కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ బీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ బలం 22కి చేరింది. అప్పటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఓటుతో చైర్మెన్‌ పీఠం బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ అబ్బగోని రమేష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో 9 మంది కౌన్సిలర్లు కోమటిరెడ్డి వెంకట రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందగానే మరో ఆరుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమం లో కాంగ్రెస్‌ కౌన్సిలర్లు మున్సిపల్‌ చైర్మెన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఇటీవల కలెక్టర్‌ను కోరారు. దాంతో సోమవారం అవిశ్వాస తీర్మానం పై ఓటింగ్‌ జరిగింది. ఈ సమయంలో కాంగ్రెస్‌కు ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లతోపాటు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ కూడా మద్దతు ప్రకటించారు. అవిశ్వాసం లో కాంగ్రెస్‌ నెగ్గడంతో మందడి సైదిరెడ్డి మున్సిపల్‌ చైర్మెన్‌ పదవి కోల్పోయారు. దీంతో కాంగ్రెస్‌ కౌన్సి లర్లలో ఒకరిని చైర్మెన్‌గా ఎన్నుకునే అవకాశం ఉంది.

Spread the love