రోజుకో పేరు

Name of the day– ఖమ్మం కాంగ్రెస్‌ టిక్కెట్‌పై ఉత్కంఠ
– సీఈసీ ముగిసినా వీడని సందిగ్ధత
– కొత్తగా తెరపైకి మండవ, సుహాసిని పేర్లు
– ప్రసాద్‌రెడ్డికే అవకాశాలంటున్న శ్రేణులు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ టిక్కెట్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. పైగా టిక్కెట్‌ కేటాయింపు ఆలస్యమవుతున్నా కొద్దీ రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. జిల్లా రాజకీయాలతో సంబంధం లేని వారి పేర్లు కూడా వినిపిస్తుండటం ఆశ్చర్యం గొల్పుతోంది. ఖమ్మం స్థానానికి స్థానికేతరులను ఎక్కువగా ఆదరించిన గత చరిత్ర ఆధారంగా కొత్త పేర్లు వినిపిస్తున్నాయనే టాక్‌ నడుస్తోంది. కొత్తగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, గతంలో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి, వీవీసీ గ్రూపు సంస్థల అధినేత వంకాయల పాటి రాజేంద్రప్రసాద్‌ పేర్లు కూడా వ్యాప్తిలోనే ఉన్నాయి. మంత్రుల కుటుంబీకుల పేర్లు క్రమేణా పక్కకు పోతుండగా కొత్త పేర్లు తెరపైకి వస్తుండటం ఆసక్తికరంగా మారింది. అయినప్పటికీ మొదటి నుంచి టిక్కెట్‌ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు అంటున్నాయి. మరోవైపు మొన్న 6వ తేదీన హైదరాబాద్‌ తుక్కుగూడ సభకు ముందు మంత్రుల కుటుంబీకులకు ఎవరికీ ఇచ్చేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పినట్టు టాక్‌ నడుస్తోంది.
కాంగ్రెస్‌కు గ్యారంటీ సీటు కావడమేనా ప్రతిబంధకం..?
పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడి దాదాపు నెల రోజులవుతోంది. గత నెల 16వ తేదీన నోటిఫికేషన్‌ వచ్చింది. ఆ తర్వాత 14 మంది అభ్యర్థులపై కాంగ్రెస్‌ అధిష్టానం స్పష్టతనిచ్చింది. నాలుగు విడతలుగా అభ్యర్థులను ప్రకటించింది. ఏ ఒక్క జాబితాలోనూ ఖమ్మం ఊసు లేకపోవడం చర్చనీయాంశమైంది. ఖమ్మం లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలను గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. 16 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న ఈ శాసనసభ స్థానాల అన్నింటిలో కలిపి కాంగ్రెస్‌, దాని మద్దతుదారులు మూడు లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించారు. కాబట్టి ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎవరు పోటీ చేసినా ‘నల్లేరుపై నడకే’ అన్న ప్రచారం ఉంది. అదే కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ కేటాయింపునకు ప్రతిబంధకంగా మారినట్టు తెలుస్తోంది. దీనికితోడు ముగ్గురు మంత్రుల మధ్య టిక్కెట్‌ విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడమే ప్రధాన కారణంగా చర్చ సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశం ముగిసి 20 రోజులకు పైగా అవుతోంది. ఈనెల 6వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ సభ కూడా అయింది. అయినా ఖమ్మం లోక్‌సభ టిక్కెట్‌ కేటాయింపుపై సందిగ్ధత అలానే ఉంది.
ఇప్పటికీ ప్రసాద్‌రెడ్డి వైపే మొగ్గు..!
రకరకాల రాజకీయ, సామాజిక సమీకరణాలు, ఊహాగానాలు కొనసాగుతున్నా పొంగులేటి ప్రసాద్‌రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది. ముగ్గురు మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరకే ఆయనకు టిక్కెట్‌ కేటాయింపు ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రత్యక్షంగా, పరోక్షంగా..15 నుంచి 20 మంది ఎమ్మెల్యేల నైతిక మద్దతు ఉండటం కలిసివచ్చే అంశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సుహాసిని, మండవ పేర్ల వెనుక..
నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి నుంచి గతంలో టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థిగా కూకట్‌పల్లి నుంచి పోటీ చేసి ఓడిన నందమూరి హరికృష్ణ కూతురు సహాసిని పేర్లు కొత్తగా వినిపిస్తున్నాయి. ఈ పేర్లను తెరమీదకు తేవడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ‘హస్తం’ ఉందనే టాక్‌ నడుస్తోంది. మండవకు పార్లమెంట్‌ టిక్కెట్‌పై గతంలో హామీ ఇచ్చారని, సుహాసినికి టిక్కెట్‌ ఇవ్వడం ద్వారా పాత టీడీపీ క్యాడర్‌ను ఆకట్టుకోవచ్చనే వ్యూహంతో తుమ్మల దౌత్యం నెరుపుతున్నట్టు చర్చ సాగుతోంది. టీడీపీలో ఉండగా మండవతో ఇటు తుమ్మల, అటు సీఎం రేవంత్‌ సాన్నిహిత్యంగా ఉండేవారని అంటున్నారు. మొత్తమ్మీద వీరిలో ఎవరికి టిక్కెట్‌ దక్కినా సంచలనమే.

Spread the love