నవతెలంగాణ – పరకాల
పరకాల జూనియర్ సివిల్ కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ అత్యంత విజయవంతంగా ముగిసింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల సివిల్ మరియు క్రిమినల్ కేసులను ఇరువర్గాల అంగీకారంతో పరస్పర రాజీ ద్వారా పరిష్కరించారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జి. సాయి శరత్ నేతృత్వంలోని మొదటి బెంచీ, న్యాయమూర్తి బోడ్డు శ్రీవలి శైలజ నేతృత్వంలోని రెండో బెంచీ సమర్థవంతంగా వ్యవహరించి రికార్డు స్థాయిలో మొత్తం 5307 కేసులను పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. పరిష్కరించబడిన వాటిలో 5263 క్రిమినల్ కేసులు, 8 బ్యాంక్ పీఎల్సీ కేసులు ఉండగా, ఈ ప్రక్రియ ద్వారా మొత్తం రూ. 16,00,960 నగదు వసూలైనట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ లోక్ అదాలత్‌ను “ప్రజా కోర్టు”గా అభివర్ణించారు. న్యాయ వ్యవస్థపై భారాన్ని తగ్గించడంతో పాటు, సామాన్య ప్రజలకు ఉచితంగా మరియు త్వరితగతిన న్యాయం అందించడమే ఈ వేదిక ప్రధాన ఉద్దేశమని వారు స్పష్టం చేశారు. కోర్టు పరిధిలోకి వచ్చిన కేసులే కాకుండా, వివాదాలు తలెత్తిన ప్రారంభ దశలోనే ఇక్కడ రాజీ చేసుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని వారు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పరకాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుక్కట్ల శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ అధికారులు, బ్యాంక్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో కక్షిదారులు పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో ఎస్‌బీఐ న్యాయ సలహాదారు సురేష్ ఆధ్వర్యంలో కక్షిదారులకు మరియు కోర్టు సిబ్బందికి న్యాయమూర్తుల చేతుల మీదుగా పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు.



