నవీన్‌ రెడ్డికి కాంగ్రెస్‌ను విమర్శించే హక్కులేదు

– జడ్పీటీసీగా కాంగ్రెస్‌ గెలిపిస్తే నీ పదవిని బీఆర్‌ఎస్‌కు తాకట్టు పెట్టావు
– నవీన్‌ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ శ్రేణులు
నవతెలంగాణ-షాద్‌నగర్‌
నవీన్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీని కానీ, వీర్లపల్లి శంకర్‌ను కానీ విమర్శించే హక్కు లేదని కాంగ్రెస్‌ నేతలు రఘు, పీసీసీ సభ్యులు మహమ్మద్‌ అలీఖాన్‌ బాబర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం షాద్‌నగర్‌ పట్టణంలోని వీర్లపల్లి శంకర్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ నాగర్‌ కుంట నవీన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి వీర్లపల్లి శంకర్‌పై శుక్రవారం రాత్రి చేసిన విమర్శలపై కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది. 28 కేసులు నవీన్‌ రెడ్డిపై పోలీస్‌ స్టేషన్లలో నమోదై ఉన్నాయని, ఇందులో 11 కేసులు 420 ఉన్నాయని, 9 కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఉన్నాయన్నారు. ఇంకా ఒక హత్యాయత్నం కేసు కూడా ఉందని మీడియాకు వాటి ప్రతులు విడుదల చేసిందని చెప్పారు. ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి భూ కబ్జాదారుడు నవీన్‌ రెడ్డి చరిత్ర అందరికీ తెలుసని చెప్పారు. మామిడిపల్లి తన గ్రామ పరిసరాలలో ఎంతమంది భూములు లాక్కున్నాడో ఆధారాలతో సహా చూపెడతామన్నారు. జంగయ్య అనే వ్యక్తికి రెండు లక్షల రూపాయలు అప్పు ఇచ్చి రెండు ఎకరాల భూమిని లాక్కుంటే అతను చనిపోయాడని అతని భార్య న్యాయం కోసం పోరాడుతుందని కాంగ్రెస్‌ నాయకులు చెప్పారు. ఎమ్మెల్యే అండదండలతోనే పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని ముందు ఇతనిని అరెస్టు చేయాలని, ఎన్నికలు సజావుగా జరగాలంటే అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘కాంగ్రెస్‌కు నవీన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని నవీన్‌రెడ్డి కోన్‌ కిస్కా గొట్టం’ అంటూ తీవ్ర పదజాలాలు ప్రయోగించారు. జడ్పీటీసీగా కాంగ్రెస్‌ గెలిపిస్తే వైస్‌ చైర్మన్‌ పదవి కోసం పార్టీ మారిన స్వార్ధపరుడు నవీన్‌రెడ్డి అని విమర్శించారు. మండల స్థాయిలో ఎస్‌ఐనుంచి మొదలుకుని డీజీపీ దాకా అతనిపై ఫిర్యాదులు చేస్తే అతనిపై అధికార నాయకుల అండదండలతో చర్యలు తీసుకోలేదన్నారని తెలిపారు. ఎమ్మెల్యే అండదండలు అతనికి ఉంటంతోనే నేరస్థుడు జనాల మధ్య బహిరంగంగా స్వేచ్ఛగా తిరగ గలుగుతున్నాడని ఎన్నికల కోడ్‌ను కూడా ధిక్కరించి సమావేశాలు పెట్టి కాంగ్రెస్‌ అభ్యర్థి శంకర్‌ను బెదిరిస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే నవీన్‌ రెడ్డి అక్ర మాలపై ప్రత్యేక విచారణ జరుపుతామని, అతనిపై చట్టరీత్యా చర్య తీసుకునేందుకు ఉపక్రమిస్తామన్నారు. పేదల వద్ద గుంజుకున్న భూములను వారికి అప్పగిస్తామని చెప్పారు. అతని బాధితులు అందరూ ఏకమై అతని నేరాలను వివరించేందుకు సిద్ధంగా ఉన్నారని, అతని ఆగడాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ నడుం బిగించిందని అన్నారు.నవీన్‌ రెడ్డి మరొక్కసారి కాంగ్రెస్‌ పార్టీపైన కానీ, వీర్లపల్లి శంకర్‌ పైన కానీ విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, తిరుపతి రెడ్డి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు దంగు శ్రీనివాస్‌ యాదవ్‌, మాజీ కౌన్సిలర్‌ అప్పి, బాదేపల్లి సిద్ధార్థ, ఎర్రోళ్ల జగన్‌, శీను నాయక్‌, కోన దేవయ్య, వెంకట్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love