ఎన్‌సీఆర్టీ కమిటీ సిఫారసు అనాగరికం

– వాటిని తిరస్కరించాలి : టీఎస్‌యూటీఎఫ్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇండియా పేరును భారత్‌ గా మార్చాలనీ, భారతీయ ప్రాచీన చరిత్ర స్థానంలో పురాణాలను చేర్చాలని ఎన్‌సీఈఆర్టీ కమిటీ చేసిన సిఫారసులు అనాగరికమని, వాటిని నిర్ద్వందంగా తిరస్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇప్పటివరకు భారతదేశాన్ని ఆంగ్లంలో ఇండియా అని పిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని తెలిపారు. కానీ రాజకీయ దురుద్దేశంతో ఎన్‌సీఈఆర్టీ కమిటీ సభ్యులు రాజును మించిన భక్తిని ప్రదర్శించినట్టు కనిపిస్తున్నదని విమర్శించారు. ఇండియా అనే పదాన్ని కనుమరుగు చేయాలనే అతి ఉత్సాహం అనర్థదాయకమని పేర్కొన్నారు.
ఇలాంటి రాజకీయ ప్రేరేపిత వ్యక్తుల వల్ల విద్యారంగం సర్వనాశనం అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా వ్యవహరిస్తూ, దేశ చరిత్రను ఏకపక్షం చేయాలనుకోవటం, అశాస్త్రీయ భావజాలాన్ని పాఠ్యపుస్తకాల్లో జొప్పించి విద్యార్థుల ఆలోచనా సరళిని వారికి అనుకూలంగా మార్చాలనుకోవటం తగదని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తులను కమిటీ నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Spread the love