నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ -యుజి పేపర్ లీక్ కావడంతో ఆ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (NTA)పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. NTA స్థానంలో కొత్త సంస్థను నియమించాలి లేదా పూర్తిగా పునర్నిర్మించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. ప్రశ్నాప్రతం లీకేజీ, అక్రమాల నేపథ్యంలో వైద్య విద్యకు సంబంధించి మే 3న నిర్వహించిన జాతీయ అర్హతా పరీక్ష (నీట్ -యుజి 2026)ను రద్దు చేస్తున్నట్లు ఎన్టిఎ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సుమారు 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. తిరిగి పరీక్ష నిర్వహిస్తామని NTA ప్రకటించింది. పేపర్ లీక్ పై సీబీఐ విచారణకు ఆదేశించారు.
నీట్ పరీక్ష నిర్వహణ కోసం “మరింత పటిష్టమైన, సాంకేతికంగా అభివృద్ధి చెందిన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ” అవసరమని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) స్పష్టం చేసింది. కోర్టు నేరుగా జోక్యం చేసుకుని, పరీక్షను తిరిగి నిర్వహించడాన్ని పర్యవేక్షించేందుకు, ఇకపై ఎటువంటి లీకులు జరగకుండా చూసుకోవడానికి, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ అధ్యక్షతన, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీని నియమించాలని పేర్కొంది.
సుప్రీంకోర్టు నియమించిన మధ్యంతర పర్యవేక్షణ కమిటీ, సవరించిన పరీక్షా ప్రక్రియ భద్రతను ధృవీకరించి, నిర్థారించే వరకు కోర్టు నియమించిన ఉన్నత స్థాయి కమిటీ పర్యవేక్షణలో నీట్ యుజి 2026 పరీక్షను తిరిగి నిర్వహించాలని ఆదేశించాలని పిటిషన్ కోరింది. సాక్ష్యాధారాలను నమోదు చేయడంలో వైఫల్యం వంటి ప్రమాదాలను నివారించేందుకు, గతంలో జరిగిన ప్రశ్నాపత్రాల లీకుల నేపథ్యంలో సూచించిన విధంగా ప్రశ్నాపత్రాలను డిజిటల్ లాక్ చేయడాన్ని, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)విధానానికి మారడాన్ని తప్పనిసరి చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయవాది తన్వి దూబే దాఖలు చేశారు.
నాలుగు రోజుల్లోగా సుప్రీంకోర్టుకు దర్యాప్తు నివేదికను సమర్పించాలని సిబిఐని ఆదేశించాలని ఫైమా కోరింది. సమాచారం లీక్ వెనుక పనిచేస్తున్న నెట్ వర్క్ ల వివరాలు, జరిగిన అరెస్టులు, అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, ప్రాసిక్యూషన్ పురోగతి వివరాలు తప్పనిసరిగా ఉండాలని పిటిషన్‌ళలో పేర్కొన్నారు. అక్రమాలను పారదర్శకంగా గుర్తించేందుకు వీలుగా నీట్-యుజి 2026 కేంద్రాల వారీ ఫలితాలను NTA తక్షణమే ప్రచురించాలని పిటిషన్‌లో కోరారు.



