Saturday, August 29, 2026
E-PAPER
Homeసోపతివచ్చే ఆదివారం

వచ్చే ఆదివారం

- Advertisement -

కోఠి.. పాత పుస్తకాల మార్కెట్‌కు వెళ్లే ప్రతి ఆదివారం ఆమె అడుగుల్లో ఒక విచిత్రమైన నెమ్మది ఉంటుంది.
నేను ఎప్పటిలాగే ముందే నడుస్తుంటాను.
ఆమె మాత్రం ప్రతి స్టాల్ ముందు కాసేపు ఆగుతుంది.
ఒక పుస్తకం తీసి అట్టమీద చేతివేళ్లు జరుపుతుంది.
మొదటి పేజీ తెరుస్తుంది.
ఎవరో ఏళ్ల క్రితం రాసిన పేరు చదువుతుంది.
కొన్నిసార్లు పేజీల మధ్య దొరికిన పాత బిల్…
ఎండిపోయిన ఆకు…
మడతపెట్టిన చిన్న కాగితం…
ఏదైనా చేతిలోకి తీసుకుని కాసేపు చూస్తుంది.
మళ్లీ అదే జాగ్రత్తతో పుస్తకంలో పెట్టేస్తుంది.
ఆ ఆదివారం కూడా అంతే.
“నువ్వు పుస్తకాలు కొంటున్నావా… లేక వాటి గతాన్ని వెతుకుతున్నావా?” అడిగాను.
ఆమె నవ్వింది.
“పాత పుస్తకాలకు రెండు కథలుంటాయి.”
“ఏంటో అవి?”
“ఒకటి రచయిత రాసింది. రెండోది వాటిని చదివిన వాళ్లు రాసింది.”
“అది ఎక్కడ ఉంటుంది?”
“పేజీల మధ్య.”
ఆమె ముందుకు నడిచింది.
ఆ సమాధానం అర్థం కాలేదు.
ఆమె మాత్రం అప్పటికే మరో స్టాల్ ముందు ఆగిపోయింది.
మూడో స్టాల్ దగ్గరకు వచ్చేసరికి…
ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది.
ఆ చూపును అనుసరించి నేనూ చూశాను.
చిన్న స్టూల్ మీద…
ఒక యువకుడు పుస్తకంలో పూర్తిగా మునిగిపోయి చదువుతున్నాడు.
అతను మాకు కొత్తకాదు. ఆ మార్కెట్‌లోని పాత పుస్తకాల్లాగే… ప్రతి ఆదివారం కనిపిస్తుంటాడు.
ఈసారి కూడా…
అతని చేతిలో మందమైన ఒక పుస్తకం.
చుట్టూ బేరాల శబ్దం.
ఆ రద్దీలో కూడా… అతనికి వినిపిస్తున్నది పేజీలు తిరిగే శబ్దమే అనిపించింది.
కొద్దిసేపటి తర్వాత…
అతను జేబులోంచి మడతలు పడిన ఒక పాత బస్ టికెట్ తీశాడు.
చదివిన చోట పెట్టి… పుస్తకాన్ని మూసేశాడు.
షాపువాడి దగ్గరకు వెళ్లి చిరునవ్వుతో పుస్తకం అతని చేతిలో పెట్టాడు.
షాపువాడు నవ్వాడు.
ఆ యువకుడు కూడా నవ్వుతూ వెళ్లిపోయాడు.
ఆమె చాలాసేపు అతను వెళ్లిన దారివైపే చూస్తూ నిలబడింది.
“ఎవరు?”
అడిగింది.
“తెలియదు.”
అన్నాను.
“ప్రతి ఆదివారం కనిపిస్తుంటాడు.”
ఆమె నెమ్మదిగా ఆ పుస్తకాల షాపువాడిని అడిగింది…
“రోజూ వస్తాడా?”
షాపువాడు నవ్వాడు.
“ప్రతి ఆదివారం.”
“కొనడా?”
“కొనడు మేడమ్… కానీ ప్రతి ఆదివారం వచ్చి ఎక్కడ ఆపాడో అక్కడి నుంచి చదువుతాడు.”
నేను అడిగాను.
“మధ్యలో ఎవరైనా కొనేస్తే?”
షాపువాడు చిన్నగా భుజాలు ఎగరేశాడు.
“కొంటే అమ్మాల్సిందే సార్… ఇది వ్యాపారం.”
కొద్దిసేపు మౌనంగా ఉండి మళ్లీ అన్నాడు.
“ఒకసారి అలా జరిగింది.”
“మూడు ఆదివారాలు ఒక పుస్తకం చదివాడు.”
“నాలుగో ఆదివారం రాకముందే అమ్ముడైపోయింది.”
“తర్వాతి వారం వచ్చి అడిగాడు.”
“‘అమ్ముడైపోయింది’ అన్నాను.”
“కొద్దిసేపు అలాగే నిలబడ్డాడు.”
“తర్వాత నవ్వి…”
“‘పర్వాలేదు అన్నా… ఇంకెవరో చదువుతున్నారు కదా’ అన్నాడు.”
ఆమె ఏమీ మాట్లాడలేదు.
మెల్లగా ఆ పుస్తకం అట్టమీద చేయి వేసింది.
కాసేపటి తర్వాత…
నెమ్మదిగా పర్స్ తెరిచింది.
“దీనికి బిల్ చేయండి.”
షాపువాడు ఆశ్చర్యంగా నా వైపు చూశాడు.
నేనూ ఏమీ మాట్లాడలేదు.
అతను బిల్ రాసి…
పుస్తకం ఆమె చేతిలో పెట్టాడు.
ఆమె మొదటి పేజీ తెరిచింది.
ఖాళీగా ఉంది.
మళ్లీ మూసేసింది.
తర్వాత…
ఆ పుస్తకాన్ని తిరిగి షాపువాడి చేతిలోనే పెట్టింది.
“ఒక సహాయం చేస్తారా?”
“చెప్పండి మేడమ్.”
“ఇది మీ దగ్గరే ఉంచండి.”
షాపువాడు అయోమయంగా చూశాడు.
“మేడమ్.. ఇది ఇప్పుడు మీది.”
ఆమె చిన్నగా నవ్వింది.
“అవును.. కానీ, అతను చివరి పేజీ మూసేంతవరకు ఈ పుస్తకం అతనిదే.”
కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు.
షాపువాడు మెల్లగా తల ఊపాడు.
పుస్తకాన్ని మిగతా గుట్టలో పెట్టలేదు.
తన కుర్చీ పక్కన…
చేయి అందే దూరంలో జాగ్రత్తగా ఉంచాడు.
మేమిద్దరం అక్కడి నుంచి నెమ్మదిగా బయటికి కదిలాం. మార్కెట్ బయటికి వచ్చాక కొద్దిసేపు ఇద్దరం మౌనంగానే నడిచాం.
“ఏమాలోచిస్తున్నావు?” అడిగాను.
ఆమె చిరునవ్వింది.
“మా ఊరిలో ఒక చిన్న లైబ్రరీ ఉండేది.”
నేను ఆమె వైపు చూశాను.
“కొన్ని పుస్తకాలు ఇంటికి ఇచ్చేవారు కాదు.
ప్రతి సాయంత్రం వెళ్లి చదివేదాన్ని.”
కొద్దిసేపు ఆగింది.
“ఒకసారి… నేను చదువుతున్న పుస్తకం మరుసటి రోజు కనిపించలేదు.
ఆ రోజు కథ ఆగలేదు… నేను ఆగిపోయాను.”
నేను ఏమీ మాట్లాడలేదు.
మార్కెట్ చివరికి వచ్చేసరికి…
ఆమె ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది.
నేనూ చూశాను.
షాపువాడు మరో కస్టమర్‌కు పుస్తకాలు చూపిస్తున్నాడు.
కుర్చీ పక్కన…
ఆ పుస్తకం మాత్రం… ఒక మనిషి తిరిగి వచ్చే ఆదివారం కోసం ఎదురుచూస్తోంది.
రామ్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -