డొనాల్డ్ ట్రంప్‌కే నా ఓటు: నిక్కీ హేలీ

నవతెలంగాణ – హైదరాబాద్: నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేస్తానని రిపబ్లికన్ పార్టీ కీలక నేత, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ స్పష్టం చేశారు. విధానాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ పరిపూర్ణంగా కనిపించడంలేదని, ఇదే విషయాన్ని తాను చాలాసార్లు స్పష్టంగా చెప్పానని ఆమె ప్రస్తావించారు. ట్రంప్ విధానాలు సంపూర్ణంగా లేకపోయినప్పటికీ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఒక విపత్తు అని, కాబట్టి తాను ట్రంప్‌కే ఓటు వేస్తానని హేలీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వాషింగ్టన్‌లోని హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌లో మేధావి వర్గాల చర్చలో పాల్గొని, పలు అంశాలపై హేలీ స్పష్టత నిచ్చారు. కాగా రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థి రేసులో ట్రంప్‌కు గట్టి పోటీ ఇచ్చిన నిక్కీ హేలీ కొన్ని నెలల పాటు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె మద్దతుదారులు ఎవరికి ఓటు వేయబోతున్నారనే ఆసక్తికర చర్చ అక్కడి రాజకీయ వర్గాల్లో నడిచింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు కూడా మద్దతు ఇవ్వవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారానికి చెక్ పెడుతూ బుధవారం నిక్కీ హేలీ స్పష్టత నిచ్చారు.

Spread the love