వంగరి త్రివేణికి నిజాం వెంకటేశం స్మారక సాహిత్య పురస్కారం

 నవతెలంగాణ డిచ్ పల్లి: పుస్తక ప్రేమికులు, సాహితీవేత్త, అనువాదకులు, మానవతామూర్తి, సామాజిక స్ఫూర్తి దృక్పథం కలిగిన నిజాం వెంకటేశం పేరు మీద ప్రకటించిన మొట్టమొదటి “స్మారక సాహిత్య పురస్కారం” ను తెలంగాణ యూనివర్సిటీ మానవీయ కళల విభాగం పీఠాధిపతి, తెలుగు అధ్యయనశాఖ పాఠ్యప్రణాళిక సంఘ చైర్ పర్సన్ ప్రొఫెసర్ వంగరి త్రివేణికి ప్రదానం చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని పద్మారావు నగర్ బెల్వెడేరా హాల్ లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ సాహితీ విమర్శను, వర్తమాన సాహితీకారులను, సామాజిక స్పృహ గల పుస్తకాలను ప్రోత్సహించడానికి గాను నిజాం వెంకటేశం పేరు మీద స్మారక సాహిత్య పురస్కారాలను ప్రదానం చేయాలని కమిటి నిర్ణయించింది. నిజాం వెంకటేశం జయంతి రోజున మొదటిసారిగా ఐదుగురు సాహితీకారులకు ఈ పురస్కారాలను అందజేశారు. ఈ మేరకు త్రివేణి రాసిన “భరిణ” (స్త్రీల సాహిత్య వ్యాససంపుటి) అనే పుస్తకానికి పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ప్రముఖ సామాజిక సాహితీవేత్త, తొలి బీసీ కమీషన్ చైర్మన్ బి ఎస్ రాములు, ఎ. గంగారెడ్డి, ఆడెపు లక్ష్మీపతి, కోడె పవన్ కుమార్, వింజమూరి సూర్య ప్రకాష్, సి హెచ్ వి ప్రభాకర రావు, వాడ్రేవు చినవీరభద్రం, పత్తిపాక మోహన్, చంద్రమోహన్ తదితరులు త్రివేణికి అభినందనలు తెలిపారు. అవార్డు స్వీకరించిన త్రివేణి స్పందిస్తూ… మహోన్నత వ్యక్తి, సామూహిక శక్తి అయిన నిజాం వెంకటేశం పేరు మీద పొందిన ఈ స్మారక పురస్కారం తన రచనా వ్యాసంగం పట్ల సామాజిక సాంస్కృతిక పరమైన నిబద్దతను, బాధ్యతను మరింత పెంచిందని అన్నారు.

Spread the love