ఇక ట్వీట్‌లో అక్షరాల పరిమితి ఉండదు!

నవతెలంగాణ హైదరాబాద్: ట్విటర్‌ త్వరలో మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఆర్టికల్స్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో యూజర్లు పెద్ద పెద్ద వ్యాసాలను ట్వీట్‌ చేసుకోచ్చు. ఈ మేరకు ఓ యూజర్‌ ఆర్టికల్స్‌ గురించి చేసిన ట్వీట్‌కు మస్క్ రిప్లై ఇస్తూ.. ఈ విషయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం ట్విటర్‌లో ట్వీట్‌ చేసే అక్షరాలపై పరిమితి ఉంది. సాధారణ యూజర్లకు 280 అక్షరాలు, ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రైబర్లకు పదివేల అక్షరాల వరకు పరిమితి ఉంది. త్వరలో రాబోయే ఫీచర్‌తో అక్షరాల పరిమితి లేకుండా ట్వీట్‌లు చేయొచ్చు. అంటే, ఒక పుస్తకంలోని కంటెంట్‌ మొత్తాన్ని కూడా ట్వీట్ చేయొచ్చని సమాచారం. కంటెంట్ క్రియేటర్లకు ఆర్టికల్స్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ట్విటర్‌ భావిస్తోంది. అయితే, ఈ ఫీచర్‌ను ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేస్తారా? లేక సాధారణ యూజర్లకు సైతం అందుబాటులోకి తీసుకొస్తారా? అనేది వేచిచూడాలి.

 

Spread the love