తెలంగాణ రుణమాఫీ ఏదీ?

– లక్ష రూపాయలు మాఫీ రూ.25వేలకే పరిమితం
– మిత్తికీ చాలని సహాయం
– రుణ మాఫీ కోసం ఎదురు చూస్తే రెండింతలైన అప్పు
నవతెలంగాణ – కొనరావుపేట
గిట్టుబాటు గాని సాగుతో అప్పుల్లో కూరుకుపోయిన రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. ప్రైవేటు అప్పుల నుంచి ఉప శమనం లభిస్తుందని రైతులు ఆశపడ్డారు. 2014లో జరిగిన ఎన్నికల్లో రుణ మాఫీ ప్రకటించి నాలుగు సంవత్సరాలు కాలయాపన చేశారు. రూ. లక్ష రుణానికి మాఫీ వస్తుందని ఆశపడిన రైతులు బ్యాంకులకు కిస్తీలు చెల్లించడం మానేశారు. దశలవారీగా రుణమాఫీ అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేయడంతో ఐదేళ్లకు రూ. లక్ష మాఫీ చేసినప్పటికీ మిత్తికే సరిపోయిందని రైతులు వాపోయారు. 2018లో మరోసారి శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. రూ.లక్ష రుణం దశలవారీగా మాఫీ చేస్తామని చెప్పింది. కానీ ఎన్నికల్లో గెలిచి నాలుగు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు రూ. 25వేలలోపు రుణం తీసుకున్న వారికి మాత్రమే రుణమాఫీ అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పంటకు మిత్తీ కట్టాలని, రుణము రెన్యువల్‌ చేసుకోవాలని రైతులను బ్యాంకర్లు భయపెడుతున్నారు. ప్రతి పంట పంటకు మిత్తీ కట్టడానికే సరిపోతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం మర్చిపోయిందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి లక్షలోపు రుణమాఫీ వెంటనే మాఫీ చేయాలని లేని పక్షంలో రైతులు తీవ్ర నష్టపోతారు. నలుగురు ప్రతిపక్షాలు రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలి.. : సీపీఐ(ఎం) డివిజన్‌ కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు
ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. వెంటనే రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేయాలి. బ్యాంకర్లకు మిత్తి కట్టడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంట దిగుబడి రాక చేసిన అప్పులు తీరవనే బెంగతోనే రైతులు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి.

Spread the love