అ ఐదు రాష్ట్రాల్లో యాత్రలు వద్దు

No trips in five states– కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం హుకుం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
గత తొమ్మిదేండ్లలో కేంద్రం సాధించిన విజయాలను దేశవ్యాప్తగా ప్రచారం చేసేందుకు ”వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర” ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో నిర్వహించకూడదని కేంద్రఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సంకల్ప్‌ యాత్ర నుంచి ఐదు రాష్ట్రాలను మినహాయించిం ది. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉన్నందున ఆయా రాష్ట్రాలకు వెళ్లవద్దని కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. యాత్ర ప్రయాణానికి వినియోగించే వాహనాలను రథాలుగా పిలవడం కూడా నివారించామని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. అధికారుల పేరును జిల్లా రథ్‌ప్రభారిమార్‌ నుంచి నోడల్‌ అధికారిగా మార్చారు. నవంబర్‌ 20 నుంచి జనవరి 25 వరకు జరిగే యాత్రలో కేంద్ర ఉద్యోగులను చేర్చుకోవాలనే నిర్ణయం వివాదాస్పదమైంది. యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాయింట్‌ సెక్రెటరీ, డైరెక్టర్‌, డిప్యూటీ సెక్రెటరీ స్థాయి అధికారులను జిల్లా రథసారధులుగా నియమించడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీంతో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల తరువాత వాహనాలు వస్తాయని, ప్రభుత్వ అధికారులను యాత్రలో ఉపయోగించుకోవాలనే వివాదం తప్పదని అపూర్వ చంద్ర అన్నారు. నవంబర్‌ 15న బిర్సా ముండా జయంతి రోజున ప్రధాని మోడీ యాత్రను జెండా ఊపి ప్రారంభించున్నారు. జనవరి 25న యాత్ర ముగుస్తుంది.

Spread the love