– సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ వాదనలు
న్యూఢిల్లీ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు సహకరించకపోవడమే తన అరెస్టుకు కారణం కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. లిక్కర్ పాలసీ కేసులో తన అరెస్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో సోమవారం వాదనలు జరిగాయి.
”ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రకటించిన తర్వాత కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. ఆయన అరెస్టుకు కారణం ఏమిటి? ఆయన కరడుగట్టిన నేరస్థుడా లేక ఉగ్రవాదా? పారిపోయేవాడా? లేదా దోషి అయిన ముఖ్యమంత్రిని ఇన్నాళ్లూ స్వేచ్ఛగా తిరిగేందుకు వదిలేశారా?” అని కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ఈ కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారా? అని సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం అక్రమమని, అందుకే తాము ఎలాంటి పిటిషన్లు వేయలేదని సింఘ్వీ చెప్పారు. సమన్లు ఇచ్చినా హాజరుకాకుండా ఉండే హక్కు కేజ్రీవాల్‌కు ఉందని, ఆ కారణంతో అరెస్టు చేయడం సరికాదని తెలిపారు. ఆయన అరెస్టుకు వేరే కారణాలున్నాయని పేర్కొన్నారు. వాదనల అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది.
కేజ్రీవాల్‌ను కలిసిన ఆయన భార్య సునీత
కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన భార్య సునీతను అనుమతించడం లేదని ఆప్ సోమవారం ఉదయం విమర్శించింది. అనంతరం జైలు అధికారులు అనుమతించడంతో సోమవారం మధ్యాహ్నం ఆమె తీహార్ జైలులో కేజ్రీవాల్‌ను కలిశారు.అనంతరం రాష్ట్ర మంత్రి అతిషి మీడియాతో మాట్లాడుతూ ‘పనులు ఎలా జరుగుతున్నాయి? పిల్లలకు పుస్తకాలు అందుతున్నాయా? మొహల్లా క్లినిక్‌లలో మందులు సరిపడా ఉన్నాయా?’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారని చెప్పారు. తాను కచ్ఛితంగా బయటకు వస్తానని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని ప్రజలకు చెప్పాలని సీఎం కోరారని తెలిపారు.