ఆగని నరమేధం

Non-stop carnage– ఇజ్రాయిల్‌ దాడుల్లో 42మంది పాలస్తీనియన్లు మృతి
– షాటి శరణార్ధ శిబిరంపై దాడిలో 24మంది
– తుఫా ప్రాంతంపై దాడిలో 18మంది
– పౌర లక్ష్యాలపై దాడుల పట్ల హమాస్‌ ఆందోళన
గాజా : గాజాలో ఇజ్రాయిల్‌ సైన్యం జరిపిన దాడుల్లో 42మంది పాలస్తీనియన్లు మరణించారు. షాటి శరణార్ధ శిబిరంలోని ఏడు నివాసాలపై జరిగిన దాడిలో 24మంది చనిపోగా, తుఫా ప్రాంతంలో జరిగిన దాడిలో 18మంది మరణించారని గాజా మీడియా కార్యాలయం ప్రకటించింది. ఇజ్రాయిల్‌ దాడుల్లో మరణించిన,గాయపడిన వారిని చేరుకోవడం కూడా చాలా కష్టంగా మారిందని గాజా పౌర రక్షణ దళాల ప్రతినిధి వ్యాఖ్యానించారు. జరుగుతున్న విధ్వంసం స్థాయితో పోల్చుకుంటే తమ పౌర రక్షణ సామర్ధ్యం చాలా పరిమితంగా వుందని ఆయన పేర్కొన్నారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారి కోసం శిధిలాల కింద సహాయక బృందాలు ఇంకా గాలిస్తున్నాయని చెప్పారు. ఎంతమంది శిధిలాల కింద పడి వున్నారో కూడా తెలియదన్నారు.
ఈ దాడితో మొత్తం ఆ నివాస ప్రాంగణమంతా దుమ్ము ధూళితో నిండి శిధిలాల కుప్పగా మారింది. వాటిని చూస్తేనే దాడి తీవ్రత అర్ధమవుతోంది. ఆ శరణార్ధ శిబిరంలోని అనేక నివాస భవనాలను ఇజ్రాయిల్‌ జెట్‌లు లక్ష్యంగా చేసుకున్నాయి.
ఇలా పౌరులను ఇజ్రాయిల్‌ లక్ష్యంగా చేసుకోవడం పట్ల హమాస్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. నిస్సహాయులైన సామాన్యులను ఇలా కిరాతకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని, తాజాగా షాటి శరణార్ధ శిబిరంపై ఊచకోత మొదలు పెట్టారని విమర్శించింది. ఈ మేరకు హమాస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటువంటి దారుణ నేరాలను ఖండిస్తూ అంతర్జాతీయ సమాజం సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని పేర్కొంది. ఇజ్రాయిల్‌ నేరాలను, ఉల్లంఘనలను, ఆక్రమణలను తక్షణమే ఆపాలని కోరింది. పాలస్తీనియన్లపై అన్ని రకాలుగా ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఇజ్రాయిల్‌ ఇందుకు తగ్గ మూల్యాన్ని చెల్లించాలని హమాస్‌ పేర్కొంది. ఎంత జరిగినా పాలస్తీనియన్ల సంకల్పాన్ని మార్చలేరని స్పష్టం చేసింది.
మరోవైపు పశ్చిమ రఫాలో మరింత లోపలకు ఇజ్రాయిల్‌ ట్యాంకులు చొచ్చుకుపోతున్నాయి. నగరంపై అటు యుద్ధ విమానాలు ఇటు శతఘ్ని ట్యాంకులు నిరంతరాయంగా దాడులు కొనసాగిస్తునే వున్నాయి. సురక్షిత ప్రాంతంగా ప్రకటించిన అల్‌మవాసిపైన, అల్‌ అక్సా ఆస్పత్రిపైనా కూడా దాడులు జరుగుతునే వున్నాయని ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై పోయిందని డబ్ల్యుహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకు 37,551మంది మరణించగా, 85,911మంది గాయపడ్డారు. వారం రోజుల వ్యవధిలో నలుగురు పిల్లలు పోషకాహార లోపంతో మరణించారని కమల్‌ అద్వాన్‌ ఆస్పత్రి డైరెక్టర్‌ తెలిపారు.

Spread the love