గాజా ఉక్కిరిబిక్కిరి!

Gaza is suffocating!– 24గంటల్లో నీరు, విద్యుత్‌ నిల్వలు ఖాళీ
– ఆస్పత్రుల్లో పరిస్థితులు దయనీయం
– పొంచివున్న ఇన్ఫెక్లన్లు, అంటువ్యాధులు
– సాయం కోసం ప్రజల ఎదురుతెన్నులు
జెరూసలేం, గాజా : హమాస్‌ ఆధీనంలో వున్న గాజాపై ఇజ్రాయిల్‌ బాంబు దాడులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు నీరు, విద్యుత్‌ నిల్వలు తరిగిపోతుండడంతో గాజా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. పలు దేశాల నుండి వచ్చిన వందలాది మెట్రిక్‌ టన్నుల ఆహారం, ఇతర సాయం ఈజిప్ట్‌లోని సినారు ద్వీపకల్పంలో రోజుల తరబడి నిలిచిపోయింది. బాంబులతో మోత మోగుతున్న గాజాకు సురక్షితంగా చేరవేయడం పెద్ద సాహస కృత్యంగా మారింది. గాజాకు సాయం అందించడం, విదేశీ పాస్ట్‌పోర్టు గల వారందరినీ రాఫా క్రాసింగ్‌ ద్వారా తరలించడానికి ఒప్పందం కుదిరేవరకు ఈ సాయం ఆగిపోయింది. బాధితులకు సాయమందిం చడం కోసం దౌత్య ప్రయత్నాలు కూడా ఉధృతమ య్యాయి. ఈ తరుణంలో గాజాతో గల సరిహద్దును ఈజిప్ట్‌ తెరుస్తుందని భావిస్తు న్నారు. ప్రాణాధార మైన సాయం రాఫా క్రాసింగ్‌ వద్ద ఎదురు చూస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) పేర్కొంది. వైద్య సరఫరాలు, ఇంధనం, పరిశుభ్రమైన నీరు, ఆహారం, ఇతర మానవతా సాయాన్ని రాఫా క్రాసింగ్‌ ద్వారా గాజాకు వెళ్లేందుకు అనుమతించా లంటూ డబ్ల్యుహెచ్‌ఓ ఇప్పటికే పలు విజ్ఞప్తులు చేసింది. ఇదిలావుండగా, మరోవైపు గాజావ్యాప్తంగా అస్పత్రిల్లో ఇంధన నిల్వలు తరిగిపోతున్నాయి. మరో 24గంటలు మాత్రమే వస్తాయని భావిస్తున్నారు. దీంతో వేలాదిమంది రోగుల ప్రాణాలు ముప్పు బారిన పడనున్నాయని ఐక్యరాజ్య సమితి మానవతా కార్యకలాపాల కార్యాలయం (ఒసిహెచ్‌ఎ) సోమ వారం తెలిపింది. గాజాలో పరిమిత నీటి నిల్వలు మాత్రమే వుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే పారిశుధ్యం కూడా దారుణంగా వుందని, ముఖ్యంగా ఆస్పత్రుల్లో పరిస్థితి ఘోరంగా వుందని, దీనివల్ల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు చెలరేగే ప్రమాద ముందని ఆందోళన వెలిబుచ్చింది. ఒకవేళ ఆరోగ్య సంక్షోభం తలెత్తిన పక్షంలో వెంటనే స్పందించేందుకు వీలుగా లెబనాన్‌ కు కీలకమైన వైద్య సరఫరాలను పంపించడాన్ని వేగిరపరిచినట్లు తెలిపింది.
‘నీరు, విద్యుత్‌ లేక గాజా ఉక్కిరిబిక్కిరి అవుతోంది, ప్రస్తుత తరుణంలో ప్రపంచం తన మావనత్వాన్ని మరిచిపోయినట్లు కనిపిస్తోంది.’ అని ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా శరణార్దుల కమిషనర్‌ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ) జనరల్‌ ఫిలిప్‌ లాజారిని వ్యాఖ్యానించారు.
వైమానిక దాడుల వల్ల రాఫా క్రాసింగ్‌ను మూసివేశారు. కాగా ఒప్పందానికి అమెరికా మధ్య వర్తిత్వం నెరపడం కోసం ప్రయత్నిస్తోంది. కాగా, ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ దాడుల్లో గాజాలో 2670 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. వీరిలో నాల్గోవంతు మంది చిన్నారులే, మరో 10వేల మంది గాయపడ్డారు. ఇంకో వెయ్యిమంది గల్లంతయ్యారు. వీరు శిధిలాల కింద చిక్కుకుని వుంటారని భయపడుతున్నారు.
కాల్పుల విరమణ లేదు
రాఫా సరిహద్దు క్రాసింగ్‌కు అనుమతించేందు కు గాజాలో కాల్పుల విరమణ జరిగిందని వచ్చిన వార్తలను ఇజ్రాయిల్‌ తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటన చేస్తూ, ‘గాజాకు సాయమందేందుకు, విదేశీ యులను తరలించేందుకు ప్రస్తుత తరుణంలో ఎలాంటి కాల్పుల విరమణ లేదు’ అని స్పష్టం చేసింది. అంతకుముందు రాఫా తెరిచేందుకు ఒప్పందం కుదిరిందంటూ ఈజిప్ట్‌ భద్రతా వర్గాలు తెలిపాయని వార్తలు వెలువడ్డాయి. దక్షిణ గాజాలో కాల్పుల విరమణకు ఈజిప్ట్‌, అమెరికా, ఇజ్రాయిల్‌ అంగీకరించాయని ఆ వార్తలు తెలిపాయి. పలు గంటల పాటు ఈ కాల్పుల విరమణ వుండవచ్చని కానీ కచ్చితంగా ఎప్పుడు ప్రారంభమయేది తెలియదని పేర్కొన్నాయి.
హమాస్‌ చెరలో 199 మంది బందీలు
హమాస్‌ అదుపులోకి తీసుకున్న వారు 199మంది వున్నారని ఇజ్రాయిల్‌ మిలటరీ సోమవారం స్పష్టం చేసింది. ఆ 199 బందీల కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నామని సైనిక ప్రతినిధి డేనియల్‌ హగారి మీడియాకు తెలిపారు. అంతకుముందు 155 బందీలని ప్రకటించింది. ఇజ్రాయిలీలతో పాటూ విదేశీయులు కూడా బందీల్లో వున్నారు.
తక్షణమే బందీలను విడిచిపెట్టి గాజాకు మానవతా సాయాన్ని అందేలా చూడాల్సిందిగా యుఎన్‌ చీఫ్‌ విజ్ఞప్తి చేశారు. అరబ్‌ లీగ్‌ చీఫ్‌ కూడా ఇదే విజ్ఞప్తి చేశారు.

Spread the love