Sunday, August 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్108 అంబులెన్స్‌లో సాధారణ ప్రసవాలు.. తల్లీబిడ్డలు క్షేమం

108 అంబులెన్స్‌లో సాధారణ ప్రసవాలు.. తల్లీబిడ్డలు క్షేమం

- Advertisement -

ఒకే రోజు రెండు వేర్వేరు ఘటనల్లో సమయస్ఫూర్తితో సేవలు అందించిన 108 సిబ్బంది
నవతెలంగాణ-మక్తల్ 

నారాయణపేట జిల్లాలో ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల 108 అంబులెన్స్‌లలో సాధారణ ప్రసవాలు విజయవంతంగా నిర్వహించి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది చూపిన సమయస్ఫూర్తిని బాధిత కుటుంబ సభ్యులు, వైద్యులు అభినందించారు. దామరగిద్ద మండలంలోని దామరగిద్ద తాండాకు చెందిన అనురాధ తన మూడవ ప్రసవం కోసం తీవ్ర పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అంబులెన్స్‌లో గర్భిణిని దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రసవ వేదనలు ఎక్కువ కావడంతో టెక్నీషియన్ ఎల్లమ్మ, ఈఆర్సీపీ వైద్యుడు డాక్టర్ శివ సూచనల మేరకు అంబులెన్స్‌లోనే సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. అనంతరం తల్లి, ఆడ శిశువుకు అవసరమైన వైద్యసేవలు అందించి దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

అదే రోజు నర్వ మండలం నర్వ గ్రామానికి చెందిన రేఖ తొలి ప్రసవం కోసం నర్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకోగా వైద్యులు పరిశీలించి నెలలు పూర్తికాకపోవడంతో నారాయణపేట జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా మందిపల్లి గ్రామం సమీపంలో పురిటి నొప్పులు అధికమై అంబులెన్స్‌లోనే మగ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, శిశువును నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. శిశువు తక్కువ బరువుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటంతో అత్యవసర చికిత్స కోసం 108 నియోనేటల్ అంబులెన్స్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా 108 ప్రోగ్రామ్ మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడుతున్నారని తెలిపారు. జిల్లా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా 108 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా మేనేజర్ సునీల్ కుమార్ సూచించారు.దామరగిద్ద 108 అంబులెన్స్ పైలెట్ రాజు టెక్నీషియన్ ఎల్లమ్మ, ధన్వాడ 108 అంబులెన్స్ పైలెట్ వెంకటేష్, టెక్నీషియన్ లక్ష్మీనారాయణలను బాధిత కుటుంబ సభ్యులు, వైద్యులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -