Saturday, August 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅంటారియో కాదు... అమెరికా!

అంటారియో కాదు… అమెరికా!

- Advertisement -

సరస్సుకు ట్రంప్ నామకరణం…
కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం

వాషింగ్టన్ : కెనడాతో వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అంటారియో సరస్సు పేరును అమెరికా సరస్సుగా మార్చాలని ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. పేరు మార్పు తక్షణమే అమలులోకి వస్తుందని ఓవల్ కార్యాలయంలో ఆయన తెలిపారు. ఉత్తర అమెరికాలోని ఐదు గొప్ప సరస్సులలో అంటారియో ఒకటి. ఇది అమెరికా – కెనడా సరిహద్దులో ఉంది. దీనికి ఉత్తరాన కెనడాలోని అంటారియో రాష్ట్రం, దక్షిణాన అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం ఉన్నాయి.

గుర్తించే ప్రశ్నే లేదు : కెనడా
అమెరికా, కెనడా మధ్య జరిగిన వాణిజ్య చర్చలు ఈ నెల 21న విఫలమైన విషయం తెలిసిందే. ఇరవై బిలియన్ డాలర్ల విలువ కలిగిన కెనడా ఉత్పత్తులపై ట్రంప్ యాభై శాతం సుంకాన్ని విధించారు. కెనడా కూడా ఘాటుగానే స్పందిస్తూ అమెరికా ఉత్పత్తులపై అంతే మొత్తంలో టారిఫ్ విధించింది. కాగా సరస్సుకు ట్రంప్ పెట్టిన కొత్త పేరును గుర్తించబోమని కెనడా స్పష్టం చేసింది. ‘అమెరికా, కెనడా దేశాలు ఏర్పడక ముందే సరస్సుకు ఆ పేరు ఉంది. అమెరికా మారిపోతోందని మాకు తెలుసు. వారి వాణిజ్య సంబంధాలు, విదేశాంగ విధానాలు, జాతీయ స్మారక చిహ్నాలు, జలనామాలు…అన్నీ మారిపోతున్నాయి’ అని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వ్యంగ్యంగా అన్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ అది లేక్ అంటారియోనే అని చెప్పారు.

అమెరికా ఫెడరల్ వినియోగానికే వర్తింపు
ఓ అంతర్జాతీయ చిహ్నానికి దీర్ఘకాలంగా కొనసాగుతున్న పేరును ట్రంప్ మార్చేయడం ఇది రెండోసారి. గత సంవత్సరం రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చేశారు. దీనిపై మెక్సికో, ఇతర దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాగా ట్రంప్ జారీచేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు అమెరికా ఫెడరల్ వినియోగానికి మాత్రమే వర్తిస్తుంది. కెనడా, అంతర్జాతీయ సంస్థలు లేదా ఇతర సంస్థలు ఆ సరస్సును ఏమని పిలవాలో అమెరికా నియంత్రించలేదు. లేక్ అంటారియో ఉపరితల వైశాల్యంలో 52 శాతం కెనడాలో ఉండగా మిగిలినది న్యూయార్క్‌లో ఉంది. లేక్ అంటారియోను లేక్ అమెరికాగా పిలవబోమని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ అన్నారు. కెనడా, న్యూయార్క్ సరిహద్దున ఉన్న వెర్మోంట్ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ గవర్నర్ ఫిల్ స్కాట్ కూడా ట్రంప్ నిర్ణయాన్ని సంకుచితమైనదిగా అభివర్ణించారు.

మనకు కావాల్సింది ఇక సముద్రమే
‘మన దగ్గర ఓ గల్ఫ్ ఉంది. అలాగే ఓ సరస్సు కూడా ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఓ మహా సముద్రం మాత్రమే. కాబట్టి అట్లాంటిక్ లేదా పసిఫిక్ సముద్రాల పేర్లను మార్చాల్సి రావచ్చు. బహుశా ఆ రెండింటి పేర్లనూ మార్చవచ్చు’ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -