ఎమ్మెల్సీ ఎన్నికలకు మే 2న నోటిఫికేషన్ 

–  9 వరకు నామినేషన్ల స్వీకరణ
– మే 27న  పోలింగ్ 
 – జూన్ 5న కౌంటింగ్
 – కలెక్టర్ హరిచందన  దాసరి
నవతెలంగాణ-నల్గొండకలెక్టరేట్
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభధ్రుల  నియోజకవర్గం ఎన్నికల షెడ్యూల్ ను  కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినందున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన  కోరారు. శుక్రవారం ఆమె  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ విషయమై రాజకీయ పార్టీల ప్రతినిధులతో  జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు  విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మే 2న నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని, ఆ రోజు నుండి మే 9 వరకు నామినేషన్ల స్వీకరణ, మే 10న నామినేషన్ల పరిశీలన, మే 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. మే 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పట్టబధ్రుల  ఎమ్మెల్సీ నియోజకవర్గం పోలింగ్ ఉంటుందని, జూన్ 5న కౌంటింగ్ ఉంటుందని, జూన్ 8వ తేదీ నాటికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని ఆమె వెల్లడించారు. ఈ ఎన్నికలకు సంబంధించి నల్గొండ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం జరుగుతుందని, 12 జిల్లాలలో పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఓటర్లు ఉంటారని, 37 మంది ఏఆర్వోలు పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏఆర్వోలుగా వ్యవహరిస్తారని తెలిపారు. పట్టబద్రులఎమ్మెల్సీ ఎన్నికల   సందర్బంగా 600 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 1400 పైబడి ఉన్న పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఎన్నికల కమిషన్ కు ప్రతిపాదించడం జరిగిందని  ఆ వివరాలు రావలసి ఉందని ఆమె వివరించారు. మొత్తం 4,91,396 మంది ఓటర్లు ఉన్నారని, పోలింగ్ కేంద్రాలు తదితర అంశాలకు సంబంధించి ఇదివరకే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగిందని, ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు.ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి, వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్, పోలీస్ పరిశీలకులు అమోఘజీవన్ గాంకర్, రెవెన్యూ  అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Spread the love