జిన్‌పింగ్ పర్యటనకు ముందు కిమ్ సిస్టర్ కీలక వ్యాఖ్యలు
పోంగ్యాంగ్ : ఉత్తర కొరియాను అణ్వాయుధ రహిత దేశంగా మార్చాలన్న అమెరికా ప్రయత్నాలను ఆ దేశం మరోసారి తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో అమెరికా పగటి కలలు కంటోందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి, అధికార పార్టీ కీలక నేత కిమ్ యో జోంగ్ అన్నారు. అమెరికా నేతృత్వంలోని భద్రతా ఒత్తిళ్లు, సైనిక ముప్పులను ఎదుర్కొనేందుకు తమ దేశం అణ్వాయుధ సామర్థ్యాన్ని నిరంతరం విస్తరించుకుంటుందని ఆమె స్పష్టం చేశారు. గత నెలలో చైనా పర్యటన సందర్భంగా ఉత్తర కొరియాను అణ్వాయుధరహిత దేశంగా చేయాలనే ఉమ్మడి లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనను కొట్టిపారేశారు. ఉత్తర కొరియా అధికారిక పేరు డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్‌కే)ని ప్రస్తావిస్తూ, తమ దేశం ఇప్పటికే అణ్వాయుధ దేశమనే వాస్తవాన్ని అమెరికా అంగీకరించాల్సిందేనని కిమ్ యో జోంగ్ పేర్కొన్నారు. అణ్వాయుధ దేశంగా ఉన్న ఉత్తర కొరియా హోదాను దెబ్బతీసేలా అమెరికా చేస్తున్న వాదనలకు ఎలాంటి చట్టబద్ధత లేదని వెల్లడించారు. అమెరికా చేసే ఏకపక్ష ప్రకటనలకు చట్టబద్ధమైన విలువ లేదని, వాటిని అనుసరించే అవసరం తమకు లేదని ఆమె అన్నారు. ఉత్తర కొరియా అణ్వాయుధ హోదాను ప్రశ్నించే ప్రయత్నాలు ఫలించవని స్పష్టం చేశారు. ఆ ప్రకటనలో పేర్కొన్న అంశాలను తప్పుడు సమాచారంగా అభివర్ణించిన ఆమె, అమెరికా అధికారులు ఇప్పటికీ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా పాత ఆలోచనలకే పరిమితమై ఉన్నారని విమర్శించారు.
అమెరికా-దక్షిణ కొరియాపై ఆరోపణలు
అమెరికా, దక్షిణ కొరియా నిరంతరం ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయని కిమ్ యో జోంగ్ ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో స్వీయ రక్షణ కోసం అణు నిరోధక శక్తిని బలోపేతం చేయడం తప్పనిసరి నిర్ణయమని ఆమె పేర్కొన్నారు. తమ దేశం తీసుకున్న ఈ నిర్ణయం తిరుగులేనిదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ దానిని మార్చబోమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఉత్తర కొరియా పర్యటనకు వెళ్లనున్న సమయంలో వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఏడు సంవత్సరాల తర్వాత షీ జిన్‌పింగ్ ఉత్తర కొరియాను సందర్శించనున్నారు.
2019 తర్వాత వేగంగా అణ్వాయుధ విస్తరణ 2019లో ట్రంప్-కిమ్ జోంగ్ ఉన్ మధ్య జరిగిన కీలక దౌత్య చర్చలు విఫలమైన తర్వాత ఉత్తర కొరియా తన అణ్వాయుధ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసింది. అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అణ్వాయుధ దేశంగా ప్రపంచ గుర్తింపు పొందడమే కిమ్ జోంగ్ ఉన్ ప్రధాన లక్ష్యం. ఆ గుర్తింపు లభిస్తే ఉత్తర కొరియాపై అమలులో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
రష్యాతో సన్నిహిత సంబంధాలు
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు, సంప్రదాయ ఆయుధాలను పంపినట్లు అమెరికా, దక్షిణ కొరియా అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రతిగా రష్యా నుంచి ఉత్తర కొరియాకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందుతున్నట్లు కూడా వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమం, చైనా-రష్యా సంబంధాలు, అమెరికా వ్యూహాలు తదితర అంశాలు తూర్పు ఆసియాలో భద్రతా పరిస్థితులను ప్రభావితం చేసే కీలక అంశాలుగా మారాయి.
నూతన అణు ప్లాంటును తనిఖీ చేసిన కిమ్
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆయుధ శ్రేణి అణు పదార్థాలను తయారు చేసే కొత్త ప్లాంటును తనిఖీ చేశారు. దేశ అణు సామర్ధ్యాన్ని అత్యంత వేగంగా బలోపేతం చేయాలని అనుకుంటున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ప్రభుత్వ మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీయనఏ) అందించిన వివరాల ప్రకారం….గత ఐదు సంవత్సరాల కాలంలో ఉత్తర కొరియా ఆయుధ శ్రేణి అణు పదార్థాల ఉత్పత్తి సామర్ధ్యాన్ని రెట్టింపు కంటే ఎక్కువగా పెంచుకున్నదని కిమ్ తెలిపారు. ఈ కొత్త ప్లాంటు తమ అణు యుద్ధ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సాయపడుతుందని చెప్పారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి, అణు కార్యక్రమాన్ని టెహ్రాన్ విడనాడేలా ఒత్తిడి చేయడానికి అమెరికా ప్రయత్నిస్తున్న సమయంలో ఈ వార్తలు వెలువడడం గమనార్హం. ఉత్తర కొరియా వద్ద ఇప్పటికే 90 వార్‌హెడ్లను తయారు చేయడానికి అవసరమైన అణ్వాయుధ పదార్థం ఉన్నదని, సుమారు 50 వార్‌హెడ్లను ఆ దేశం రూపొందించిందని అమెరికా ప్రతినిధిసభకు చెందిన రిసెర్చ్ సర్వీస్ మార్చిలో తెలియజేసింది. ఉత్తర కొరియాకు యంగ్‌బ్యోన్, కంగ్‌సన్‌లలో కనీసం రెండు అణు శుద్ధి ప్లాంట్లు ఉన్నాయని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) అదే నెలలో తెలిపింది.
క్షిపణుల
ఉత్పత్తి పెంపునకు
ఆదేశాలు
ఇటీవల కొత్త అణు పదార్థాల ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన కిమ్ జోంగ్ ఉన్, దేశ అణు సామర్థ్యాన్ని మరింత వేగంతో పెంచాలని అధికారులకు ఆదేశించినట్లు ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది. అలాగే శనివారం ఆయుధాల తయారీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన, ఐదేండ్ల ప్రణాళికలో భాగంగా క్షిపణుల ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న స్థాయి కంటే 2.5 రెట్లు పెంచాలని సూచించినట్టు ప్రభుత్వ మీడియా పేర్కొంది.



