– కులగణన చేపడతాం : రాష్ట్రాల ప్రతినిధులకు రాహూల్‌గాంధీ హామీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాంగ్రెస్‌పార్టీకి ఓబీసీలు మద్దతు ఇవ్వాలనీ, అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. శనివారం 29 రాష్ట్రాలకు చెందిన ఓబీసీ సంఘాల ప్రతినిధులు, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మెన్ అఖిలభారత బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జస్టిస్ ఈశ్వరయ్య నేతత్వం న్యూఢిల్లీలోని రాహుల్‌గాంధీ నివాసంలో భేటీ అయ్యారు. పలు అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. జస్టిస్ ఈశ్వరయ్యతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కూడా దేశంలో ఓబీసీల స్థితిగతులను వివరించారు. కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం తమ సమస్యల్ని ఏమాత్రం పట్టించుకోకుండా క్రిమీలేయర్ విధిస్తూ అన్యాయం చేస్తున్నదని తెలిపారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా రిజర్వేషన్ల పెంపునకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్నదని ఈ సందర్భంగా రాహూల్‌గాంధీ భరోసా ఇచ్చారు. సమావేశంలో మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, డాక్టర్ విజయభాస్కర్, డాక్టర్ చంద్రశేఖర్, బెల్లయ్య నాయక్, గొమాస శ్రీనివాస్, డాక్టర్ రవి, జనగాం రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు.