చమురు మంట..!

చమురు మంట..!– 90 డాలర్లు దాటిన బ్యారెల్‌ ధర
– పశ్చిమాసియాలో యుద్ధ ఆందోళనల ఎఫెక్ట్‌
– 100 కు చేరొచ్చని అంచనా
న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఆందోళనలు చమురు ధరలకు ఆజ్యం పోస్తోంది. ఈ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పై భారీగానే ఉండొచ్చని తెలుస్తోంది. ప్చూచర్‌ మార్కెట్‌లో మంగళవారం బ్యారెల్‌ చమురుపై 0.5 శాతం పెరిగి 90.58 డాలర్లకు చేరింది. ఇరాన్‌- ఇజ్రాయిల్‌ మధ్య నెలకొన్న ఆందోళనతో భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ఇతరత్రా ఇంధనాల ధరలు పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ ఇంధన అవసరాలు దాదాపు 80 శాతం దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య పెరుగుతున్న ఆందోళనలు గ్లోబల్‌ మార్కెట్‌లో చమురు ధరల పెరుగుదలకు కారణం కానుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశీయంగా ఇంధన ధరలు ఎగిసిపడనున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ ప్రతీకార దాడులు చేసింది. దీనికి ఇజ్రాయిల్‌ స్పందించే తీరును బట్టి గ్లోబల్‌ మార్కెట్లు నడుస్తాయని అంటున్నారు. యుద్ధ మేఘాలతో రెండేళ్లలో ఎప్పుడూ లేనంతగా ముడి చమురు ధరలు పెరిగాయి. హార్ముజ్‌ జలసంధి ద్వారా జరిగే రవాణాకు అంతరాయం ఏర్పడితే గ్లోబల్‌ మార్కెట్‌లో చమురు ధరలు మరింత ఎగిసిపడొచ్చని అంచనా వేస్తున్నారు. ఒమన్‌, ఇరాన్‌ మధ్య ఉన్న ఈ జలసంధి ద్వారానే 20 శాతం ప్రపంచ ముడి చమురు సరఫరా అవుతుంది. ఇప్పటికే ఇజ్రాయిల్‌తో సంబంధాలున్న ఓ వాణిజ్య నౌకను ఈ జలసంధిలో ఇరాన్‌ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఒపెక్‌ కూటమి సభ్యదేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్‌, యుఎఇ, కువైట్‌ ,ఇరాక్‌ల నుంచి ఈ జలసంధి ద్వారానే పెద్ద ఎత్తున చమురు రవాణా జరుగుతుంది. మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచి అధిక చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ టాప్‌లో ఉంది. ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే బ్యారెల్‌ ముడి చమురు ధర 100 డాలర్లకు చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా మోడీ సర్కార్‌ చమురు ధరల పెంపును నిలిపివేసిందనే బహిరంగ విమర్శలున్నాయి. ప్రస్తుత లోకసభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెరుగడం ఖాయమేనని నిపుణులు భావిస్తున్నారు.
రూపాయి విలవిల..
– డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసల మేర పతనం
– రూ.83.53కు చేరిక
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో భారత రూపాయి విలువ వెలవెలబోతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణానికి తోడు డాలర్‌ విలువ పెరగడంతో రూపాయి రికార్డ్‌ పతనాన్ని చవి చూసింది. మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 8 పైసల మేర పతనమై రూ.83.53కు క్షీణించింది. ఇంతక్రితం సెషన్‌లో 83.45 వద్ద ముగిసింది. డాలర్‌ విలువ ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరింది. ఆసియన్‌ కరెన్సీల విలువ పడిపోయింది. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ మధ్య ఆందోళనలు మరింత పెరిగితే చమురు ధరలు పెరగడం, రూపాయి విలువ మరింత ఒత్తిడికి గురి కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Spread the love